కిడ్నీలో రాళ్లని వెళ్లి.. ముగ్గురికి జన్మనిచ్చింది!
కిడ్నీలో రాళ్లు ఉన్నాయని హాస్పిటల్‌కు వెళితే.. ఆపరేషన్ చేయించుకునో.. లేక మందులతోనో బయటకు వస్తారు. కానీ ఓ మహిళ మాత్రం ముగ్గురు చిన్నారులతో బయటకు వచ్చింది. తాను గర్భవతిని అనే విషయం కూడా తెలియకుండా ఆ మహిళ చిన్నారులకు జన్మనిచ్చింది. వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన దక్షిణ డకోటాలో జరిగింది. ఈ వార్తకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
దక్షిణ డకోటాకు చెందిన గిల్ట్జ్ (34) అనే మహిళ కొంత కాలంగా నడుం నొప్పితో బాధపడుతోంది. అది కిడ్నీలో రాళ్ల కారణంగా అనుకొని ఓ హాస్పిటల్‌లో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు ఎనిమిదిన్నర నెలల గర్భిణి అంటూ తేల్చాడు. కడుపులో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉండి ఉంటారని.. అది ప్రసవ వేదనతో వచ్చిన నొప్పులని చెప్పాడు. డాక్టర్ నిర్థారించినట్టుగానే ఆ మహిళ ఆగస్టు 10న ముగ్గురికి జన్మనిచ్చింది. ఎటువంటి ఆపరేషన్ లేకుండా కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే ముగ్గురు చిన్నారులు పురుడు పోసుకున్నారు. చిన్నారులంతా 1.8 కిలోల బరువుతో ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. వారంతా ఆరోగ్యంగానే ఉన్నట్టు వెల్లడించారు. ఆ చిన్నారులకు బ్లేజ్, జిప్సీ, నిక్కీ అనే పేర్లు కూడా పెట్టారు.
గిల్ట్స్ ప్రసవంపై వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 34 వారాల పాటు ఆమె కడుపులో పిండం ఉన్నా ఆమెకు తెలియకపోవడం అరుదైన విషయంగా చెబుతున్నారు. 6,7 నెలల సమయంలో కడుపులో పిండం అటూ ఇటు కదులుతుందని కనీసం అవి కూడా ఆమెకు జరగలేదని అంటున్నారు. ఉదర భాగంలో కూడా పెద్దగా మార్పులేవి కనిపించలేదని చెబుతున్నారు. దీంతోపాటు ఆమె అవగాహన లోపంతో కూడా గర్భవతిని అనే విషయాన్ని గుర్తించలేకపోయిందని అంచనా వేస్తున్నారు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా ముగ్గురికి జన్మనివ్వడం మాత్రం ఓ వింతగా వారు పేర్కొంటున్నారు. కిడ్నీ వ్యాధి అనుకొని హాస్పిటల్‌కు వెళితే ప్రసవం జరిగిందని తెలిసిన వారంతా నోరెళ్లబెడతున్నారు.