వికారాబాద్‌లో మహిళ కిడ్నాప్.. అంతా చూస్తుండగానే.. - MicTv.in - Telugu News
mictv telugu

వికారాబాద్‌లో మహిళ కిడ్నాప్.. అంతా చూస్తుండగానే..

September 28, 2020

carr

వికారాబాద్ మహిళ కిడ్నాప్ ఘటన సంచలనం సృష్టించింది. సినీ ఫక్కీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను ఓ వ్యక్తి బలవంతంగా కారులో ఎక్కించుకొని పారిపోయాడు. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. చుట్టుపక్కల వారు అప్రమత్తం అయ్యేలోపే దుండగులు పారిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఆమె భర్తే ఈ కిడ్నాప్‌కు స్కెచ్ వేసి ఉంటారని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

దీపిక అనే మహిళ 2016లో అఖిల్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. కొంత కాలం తర్వాత మనస్పర్థల కారణంగా ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. విడాకుల కోసం కోర్టుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం తన సోదరితో కలిసి షాపింగ్‌కు బయటకు వెళ్లింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో దీపికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బలవంతంగా కారు ఎక్కించుకొని పారిపోయారు. మరో యువతి కాపాడేందుకు ప్రయత్నించినా ఆమెను తోసేసి వెళ్లిపోయారు. అంబికా వస్త్ర దుకాణం సమీపంలో ఆమెను ఎక్కించుకొని.. NTR చౌరస్తా నుంచి అనంతగిరి వైపు వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

కాగా, అఖిల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో మరింత బలం చేకూరింది. దీపికను అతడు ఏం చేసి ఉంటాడోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అఖిల్ హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో  అకౌంటెంట్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. ప్రతి శనివారం ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులను చూసి సోమవారం వెళ్ళేవాడు. ఈ క్రమంలోనే కిడ్నాప్ స్కెచ్ వేసి ఉంటాడని భావిస్తున్నారు.