పీకలదాకా మద్యం తాగి ఎలాంటి ఘోరాలకు పాల్పడుతున్నారో తెలియకుండా ఉంది. పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి మహిళను తీవ్రంగా కొట్టాడు. ఆమె బతికుండగానే గొయ్యి తీసి పూడ్చపెట్టాడు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి ఏడేళ్ల కుమార్తె విషయం గురించి పెద్దలకు చెప్పడంతో.. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గొట్లపాలెం గ్రామంలో పొన్నూరు సుభాషిణి అనే మహిళకు, సాములు అనే వ్యక్తికి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఓ రోజు ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం ఏదో విషయంలో ఇద్దరూ గొడవపడ్డారు. ఆవేశంలో ఉన్న సాములు కర్రతో సుభాషిణిని గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె సృహ కోల్పోయింది. సాములు మరింత రాక్షసంగా మారి, వెంటనే పొదల్లో గుంత తీసి ఆమెను పూడ్చిపెట్టాడు. అనంతరం కూతురిని బెదిరించి పారిపోయాడు. మృతురాలి కుమార్తె రెండు రోజుల తర్వాత విషయం బందువులకు చెప్పడంతో వారు షాకయ్యారు. వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టంకు పంపారు. పరారీలో ఉన్న సాములు కోసం గాలిస్తున్నారు.