రోడ్డుపై కూలిన భవనం.. తృటిలో తప్పించుకున్న మహిళ (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

రోడ్డుపై కూలిన భవనం.. తృటిలో తప్పించుకున్న మహిళ (వీడియో)

October 15, 2020

ngngn

రోడ్డుపై ఎంత జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తున్నా అప్పుడప్పుడు ఊహించని ప్రమాదాలు ఎదురు అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు అయితే అదృష్టవశాత్తు తప్పించుకుంటూ ఉంటారు. అలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై భవనం కూలిపడిపోయే సమయంలో చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకుంది. రెప్పపాటులో జరిగిన ఈ సంఘటన అందరిని ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

మొఘల్ పురా ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఇది జరిగింది. రాత్రంతా కురిసిన వర్షానికి పురాతన భవనం పూర్తిగా నానిపోయింది. అదే సమయంలో ఈ విషయం తెలిక ఓ మహిళ నడుస్తూ వస్తోంది. దాదాపు 20 అడుగుల ఎత్తున్న ఓ పెద్ద గోడ పేకమేడలా కుప్పకూలింది. దీన్ని గమనించిన ఆమె మట్టిపెళ్లలు తనపై పడేలోపే అక్కడి నుంచి వేగంగా పరిగెత్తింది. దీంతో తృటిలో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనలో ఆమెకు ఎటువంటి గాయం కూడా కాలేదు. ఇదంతా అక్కడే అమర్చిన సీసీ కెమెరాలో రికార్డు అయింది. గోడ పడటంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె అదృష్టవంతురాలు అంటూ కామెంట్లు పెడుతున్నారు.