Women orieanted movies in Tollywood 2022 year review
mictv telugu

ఈ సంవత్సరంలో వచ్చిన ఉమెన్ ఓరియెంట్ సినిమాలు!

December 21, 2022

Women orieanted movies in Tollywood 2022 year review

ప్రతీ సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు విడుదలయ్యాయి. కొన్నిడైరెక్ట్ సినిమాలు అయితే, కొన్ని డబ్బింగ్ చిత్రాలు. కొన్ని థియేటర్లలో రిలీజ్ అయితే, మరికొన్ని సిమాలు కేవలం ఓటీటీకి పరిమితమయ్యాయి. ఏది ఏమైనా మన హీరోయిన్లు నటించి, మెప్పించిన సినిమాల గురించే ఈ ప్రత్యేక కథనం..
లవ్, క్రైమ్, సస్పెన్స్.. ఇలా కథాంశం ఏదైనా అందులో హీరోయిన్ లేకపోయినా హీరోలు ఉండాలన్నదే తెలుగు సినిమా సూత్రీకరణ. దాన్ని మార్చి చాలామంది హీరోయిన్లు తమవంతుగా కృషి చేసి లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేయడానికి ముందుకొస్తున్నారు. అలా ఈ సంవత్సరం వచ్చిన సినిమాలు కొన్నిమాత్రమే. అందులో సమంత నటించిన యశోద తప్ప ఏ సినిమా హిట్ కాలేదు. కానీ మిగతా సినిమాల గురించి కూడా మనం తెలుసుకోవాల్సిందే!

నయనతార

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది నయనతార. విఘ్నేష్ శివన్ తో పెళ్లి, కవల పిల్లలతో బిజీ అయిన ఈ నటి ఈ సంవత్సరం కూడా కొన్ని సినిమాల్లో నటించింది. అందులో ఓ 2 సినిమా ఒకటి. ఈ సినిమాను తన భర్త విఘ్నేష్ దర్శకత్వం వహించాడు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఆమె కేరాఫ్ అంటారు ఎవరైనా. ఈ సినిమాలో ఒక కొడుకును కాపాడుకునే తల్లి పాత్రలో నటించింది నయనతార. ఒక బస్సులో వెళుతుండగా కొండ చరియ విరిగి పడి లోపలికి కూరుకుపోతారు. ఆ సమయంలో ఆ బస్సులో ఉన్నవాళ్లకు ఏమవుతుంది. తన కొడుకు అప్పటికే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతుంటాడు. అతడిని, తనను తాను ఎలా కాపాడుకుందనేది సినిమా. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది.

సమంత

యశోద సినిమాతో బిగ్ హిట్ తన ఖాతాలో వేసుకుంది సమంత. సరోగసీ బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ యాక్షన్ త్రిల్లర్ గా రూపొందింది ఈ సినిమా. సుమారు 37 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఇందులో పోలీస్ ట్రైనింగ్ తీసుకున్న అమ్మాయి పోస్టింగ్ కి ముందు కేసు ఛేదించే యువతిగా నటించింది. పైగా గర్భవతిగా కూడా నటించింది. యాక్షన్ సన్నివేశాలతో మెప్పించింది. ఈ సినిమాకు హరీ హరీష్ దర్శకత్వం వహించారు. యశోదకు సీక్వెల్ కూడా తెరకెక్కిస్తున్నట్లు దర్శకులు ప్రకటించారు.

కీర్తి సురేశ్

మహానటి సినిమాతో సరికొత్త ట్రెండ్ కి అంకురార్పణ చేసింది కీర్తి. ఈ ఏడాది ఆరంభంలోనే గుడ్ లక్ సఖితో పలకరించింది. కానీ సినిమా పేరులో ఉన్న గుడ్ లక్.. సినిమా వసూల్లకు మాత్రం లేకుండా పోయింది. నేషనల్ అవార్డ్ విన్నర్ నగేష్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దురదృష్టవంతురాలిగా సమాజంలో ముద్రపడిన ఓ యువతి తన ప్రతిభతో షూటింగ్ గేమ్లో ఎలా రాణించిందనేది కథాంశం. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా మెప్పించలేకపోయింది.

సుమ కనకాల

యాంకర్ గా ఎన్నో సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసి సక్సెస్ సాధించింది సుమ కనకాల. కానీ తన సినిమా మాత్రం హిట్ అనిపించుకోలేకపోయింది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన జయమ్మ పంచాయితీ సినిమాకి ముందు చాలా హైప్ క్రియేట్ చేసింది. కారణం సినిమా ప్రమోషన్స్లో అగ్ర దర్శకులు, హీరోలు పాల్గొన్నారు. కానీ వాళ్లెవరూ ఈ సినిమా ఫట్ అవ్వగుండా ఆపలేకపోయారు. ఈ సినిమాని విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు. ఒక సాధారణ గృహిణి తనకు కష్టం వస్తే ఊరంతటినీ ఒక్కటి ఎలా చేసింది? తన భర్త ఆరోగ్యం బాలేనప్పుడు ఆ ఊరు వాళ్లకు ఎంత వరకు సహాయం చేసిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. కామెడీ, డ్రామాతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఫట్టనే చెప్పాలి.

ప్రియమణి

పెండ్లయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నది ప్రియమణి. భామకలాపం సినిమాతో ఓటీటీలో హిట్ కొట్టింది ప్రియమణి. ఆహాలో విడుదలయిన ఈ సినిమా అందరి ప్రశంసలూ పొందింది. ఈ సినిమాను అభిమన్యు దర్శకత్వం వహించాడు. ఒక సాధారణ గృహిణి యూట్యూబ్ లో వంటల వీడియోలు చేసుకుంటూ ఉంటుంది. ఆమెకు పక్కింటి విషయాలంటే మక్కువ. ఆమె దగ్గరకు ఒక కోడిగుడ్డు వచ్చి చేరుతుంది. ఎంతో విలువైన గుడ్డు చుట్టూ కథ నడుస్తుంది. మొత్తానికి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా చివరకు ఏమైందనేది సినిమా చూడండి. మంచి టైంపాస్ మూవీ.

రెజీనా, నివేదా

కొరియన్ చిత్రం మిడ్ నైట్ రన్నర్స్ సినిమా ఆధారంగా దర్శకుడు సుధీర్ వర్మ శాకినీ డాకినీ సినిమా తెరక్కించాడు. హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఇద్దరు యువతులు ఎలా పట్టుకున్నరానేది కథ. పాయింట్ బాగానే ఉన్న ఎందుకో ఈ సినిమా ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇందులో రెజీనా, నివేథా తమ పరిధుల మేరకు బాగానే నటించారు. ఇది యాక్షన్ కామెడీ ఫిల్మ్.

సాయి పల్లవి

తమిళ సినిమా అయిన గార్గిని తెలుగులో డబ్బింగ్ చేశారు. సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించింది. గౌతమ్ రాంచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. లీగల్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా క్రిటిక్స్ మెచ్చుకున్నదిగా నిలిచింది. తన తండ్రి చేయని తప్పునకు జైలుకు వెళ్లాడని ఒక కూతురు పడే ఆవేదనే గార్గి. అందరూ తన తండ్రిని తప్పుగా అనుకున్నా కూడా ఆ కూతురు మాత్రం అతడి అమాయకత్వాన్ని రుజువు చేయడానికి సమాజంతో పోరాడుతుంటుంది. ఆద్యంతం సినిమా చాలా బాగుంది. కానీ ఎందుకో అందరినీ ఈ సినిమా మెప్పించలేకపోయింది.

అమలాపాల్

తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన సినిమా కడవర్. అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. కడవర్ సినిమా ఒక థ్రిల్లర్ సినిమా. పోలీసు ఆఫీసర్ పాత్రలో ఎంతో బాగా నటించింది అమలా పాల్. అనూప్ పానేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది అమలాపాల్. మర్డర్ మిస్టరీతో ఈ సినిమా మొదలవుతుంది. ఒక హార్ట్ సర్జన్ హత్య, ఆ హత్య ఉదంతం ఎక్కడి నుంచి ఎక్కడికి దారి తీసింది, దాన్ని అమలా పోలీస్ గా ఎలా చేదించిందనే కథ. మొత్తానికి ఈ సినిమా ఓటీటీలో పర్వాలేదనిపించుకుంది.