విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కు చేదు అనుభవం ఎదురైంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పలువురు మహిళలు ఆయనను నిలదీశారు. కృష్ణలంక రాణి గారి తోటలో దేవినేని అవినాష్ పర్యటిస్తుండగా గతంలో అవినాష్ కోసం పనిచేసిన వారి నివాసాలపై తెలుగు దేశం జెండాలు కనిపించాయి. జెండాలు కట్టడంపై అవినాష్ వారిని ప్రశ్నించారు.
దీనికి ఓ మహిళ సమాధానమిస్తూ.. “పని చేసిన వాళ్ల జెండాలను మా ఇళ్లపై పెట్టుకుంటాం అందుకే తెలుగుదేశం జెండాను మా ఇళ్లపై పెట్టుకున్నాం. మీకోసం పనిచేశాం మీరు మాకు ఏం చేశారు. మమ్మల్ని మోసం చేశారంటూ” అవినాష్‌ను పలువురు మహిళలు ప్రశ్నించారు. వైసీపీ కార్పొరేటర్ రామిరెడ్డిపై కూడా మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు కూడా సంక్షేమ పథకాలు కోసం డబ్బులు అడుగుతున్నారని మహిళలు మండిపడ్డారు. ఈ సంఘటనతో దేవినేని అవినాష్ మౌనంగా ఉండిపోయారు. చివరకు వైసీపీ నేతలు మహిళలకు సర్ది చెప్పి ఏ సమస్య ఉన్న ఇకపై పరిష్కరిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.