80 యేండ్ల కింద విడిపోయిన ఇద్దరు బామ్మలు ఇప్పుడు ఒక్కటయ్యారు. ఆ నానమ్మ కల నిజం చేయడంలో మనవడి పాత్ర ఉంది. ఆ స్నేహితుల వీడియో ఇప్పుడు వైరల్ అయింది.స్నేహితులను కలువాలంటే ఒక అకేషన్ ఉండాలా? కానీ ఎందరు స్నేహితులు నిజంగా కలుస్తున్నారు. చదువుకొనేటప్పుడు కాదు.. పెండ్లి, పిల్లలు అయ్యాక సంగతి మేం అడుగుతున్నది. చాలామంది మాకు కలిసే సమయం ఉండడం లేదనే సమాధానమే చెబుతారు.
మగవాళ్లకేమో కానీ పెండ్లయిన తర్వాత ఆడవాళ్లకి చిన్ననాటి స్నేహితులను కలువడం కొద్దిగా కష్టమే. వారు తమ ఇంటిని నడిపించే బాధ్యతను భుజానకెత్తుకోవాలి. అంతేకాకుండా.. పిల్లల బాగోగులు చూసుకోవాలి. మరికొందరు ఉద్యోగం చేస్తూ బిజీ అయిపోతారు. దీంతో తమ స్నేహితులను కలుసుకోవడం కూడా చాలా అరుదుగా జరుగుతుంది.
ఇప్పుడు ఫొటోలో కనిపిస్తున్న వారి పరిస్థితి కూడా అదే! 80 సంవత్సరాల క్రితం విడిపోయారు. ఎవరి జీవితాలు వారివి అయ్యాయి. అయితే ఒకావిడ మాత్రం తన మనవడికి తన స్నేహితురాలి గురించి ఊరికే చెప్పేది. అలా ఆ మనవడికి ఒకరోజు తన నాన్నమ్మ కల నెరవేర్చలనిపించింది. నానమ్మ స్నేహితురాలి వివరాలను తెలుసుకొని తన ఇంటికి ఆహ్వానించాడు. ఎనిమిది దశాబ్దాల తర్వాత కలిసిన ఆ స్నేహితుల మధురక్షణాలను బంధించాడు. ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
ఈ వీడియోను ముఖుల్ మీనన్ అనే థైక్వాండ్ ప్లేయర్ షేర్ చేశాడు. దీంట్లో బామ్మలిద్దరూ మాట్లాడుకోవడం.. వెనుక పాట ప్లే అవ్వడం.. వారి బోసి నవ్వులు చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. చివరకు ఒక స్నేహితురాలి కాళ్లకు దండం పెట్టి మరో స్నేహితురాలు దీవెనలందుకోవడం కూడా చూడొచ్చు. ఈ వీడియోను ఇప్పటివరకు 193వేల మంది చూశారు. 21వేల మంది లైక్ చేశారు. ఈ బామ్మల స్నేహం గురించి ఇంకా ఎంతోమంది మెచ్చుకుంటూ కామెంట్ చేస్తున్నారు.