భర్త బతికుండగానే వితంతు పెన్షన్.. 106 మందిపై కేసు - MicTv.in - Telugu News
mictv telugu

భర్త బతికుండగానే వితంతు పెన్షన్.. 106 మందిపై కేసు

October 15, 2020

 

bfbgb

ఒంటరి మహిళలకు అండగా ఉండేందుకు ప్రభుత్వాలు వితంతు పెన్షన్లను అందజేస్తున్నాయి. లబ్ధిదారులను గుర్తించి పక్కాగా నగదును చేరవేస్తున్నారు. కానీ కొంత మంది మాత్రం డబ్బులకు కక్కుర్తి పడి భర్త బతికుండగానే వింతువుల పేరుతో పెన్షన్ తీసుకుంటున్నారు. యూపీలోని బాదాయూ జిల్లాలో ఈ సంఘటన వెలుగు చూసింది. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొత్తం 106 మందిపై కేసులు నమోదు చేశారు. దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని చేధించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు.

పెన్షన్ కోసం తమ భర్తలు చనిపోయినట్టుగా సర్టిఫికెట్లు చూపించి పెన్షన్ పొందుతున్నారు. ఇలా తీసుకుంటున్న మహిళలు వారి భర్తలు చనిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకున్నా కూడా డబ్బులు తీసుకుంటున్నారని అధికారుల విచారణలో తేలింది. రెండో పెళ్లి విషయాన్ని దాచి పెట్టారని అధికారులు పేర్కొన్నారు. వెంటనే వారి పింఛన్లు నిలిపివేశామన్నారు. వారిపై కేసు నమోదు చేసి ఇంత కాలం తీసుకున్న డబ్బులను తిరిగి రాబట్టేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, బాదాయా జిల్లాలోనే ఏకంగా 891 మంది వితంతువులు చనిపోయినా కూడా వారి ఖాతాలో పెన్షన్ డబ్బులు జమకావడం విశేషం. దీని వెనక అధికారుల అలసత్వం కూడా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.