ఇదో చిత్రమైన కేసు. సహజంగా ఆడవారు అందంగా ఉంటే మగవారు వెంటపడతారు లేదా వేధిస్తారు. కానీ ఆడదానికి ఆడదే శత్రువు అన్న సామెతను నిజం చేస్తూ మన దేశంలోనే ఓ వింత ఘటన చోటు చేసుకుంది. అందంగా ఉన్న తనపై ఓర్వలేక మహిళలు దాడి చేశారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే విచిత్రం అనుకుంటే విచారణలో దాడి చేసిన మహిళలు నేరం ఒప్పుకోవడం మరో ట్విస్ట్. హర్యానాలో జరిగిన ఈ వ్యవహారం వివరాలు ఇలా ఉన్నాయి.
సోనేపట్ పరిధిలోని కుండ్లీ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న స్నేహితుడు గౌరవ్ దహియా కోసం ఓ యువతి వచ్చింది. అయితే ఆ సమయంలో దహియా ఇంట్లో లేకపోవడంతో అతను వచ్చే వరకు యువతి ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో పక్క ఫ్లాట్లలో ఉండే మహిళలు ఒక్కసారిగా యువతి వద్దకు వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తూ ఆగ్రహంతో యువతిపై సామూహికంగా దాడి చేశారు.
అంతేకాక ఆమె వద్ద ఉన్న రెండు లక్షల నగదు, ఫోన్ లాక్కున్నారు. వారి నుంచి తప్పించుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించారు. దాని ఆధారంగా మహిళలు రజనీ ఖత్రి, మోనా, సాక్షి, సైనీలను విచారించగా నేరం అంగీకరించారు. దీంతో వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే అధికారికంగా వివరాలు ఇలా ఉన్నా స్థానికులు మాత్రం ఘటనపై మరో రకంగా చర్చించుకుంటున్నారు. అక్కడ వ్యభిచారం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. కేవలం అందం కారణంగా దాడి జరిగిందంటే అర్ధం అదే అని అభిప్రాయపడుతున్నారు.