Women's consumption of alcohol has reduced the birth rate in poland
mictv telugu

మగవాళ్లకి 20 ఏళ్లు పడితే.. మహిళలకు రెండేళ్లు చాలు : పోలండ్ నేత

November 8, 2022

పోలండ్ దేశానికి చెందిన అధికార పార్టీ నేత జరోస్లా కజిన్ స్కీ మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో జనన రేటు తగ్గడానికి మహిళలు మద్యం సేవించడమే కారణమని తేల్చి చెప్పారు. ఓ డాక్టర్ ఎదుర్కొన్న అనుభవం ఆధారంగా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ‘25 ఏళ్ల వయసు వచ్చే వరకు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో గమనించాలి.

ఆ వయసులో ఉన్న యువతులు తమకంటే సమాన వయసు ఉన్న పురుషులతో కలిసి సమానమైన మద్యం సేవిస్తున్నారు. అంటే పాతికేళ్ల కుర్రాడు ఎంత మందు తాగుతాడో పాతికేళ్ల అమ్మాయి కూడా అంతే మందు తాగుతోంది. అందుకే వారికి పిల్లలు పుట్టడం లేదు. పురుషుడు మద్యానికి బానిసగా మారాలంటే కనీసం 20 ఏళ్ళు పడుతుంది. కానీ మహిళలకు రెండేళ్ళు చాలు. ఓ డాక్టర్ మద్యానికి బానిసలైన మూడింట ఒకవంతు పురుషులను సరిదిద్దగలిగాడు. కానీ ఒక్క మహిళను కూడా బాగుచేయలేకపోయాడు. దీని కారణంగా పిల్లలు పుట్టకపోవడంతో జననాల రేటు 1.3 కి పడిపోయింది. ఇది ఆందోళన కలిగించే అంశం’ అని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పితృస్వామ్యానికి నిదర్శనంగా పలువురు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు కామెంట్ చేస్తున్నారు.