నెలసరి రచ్చ.. రుతుక్రమంలో వంట చేసిన మహిళలు - MicTv.in - Telugu News
mictv telugu

నెలసరి రచ్చ.. రుతుక్రమంలో వంట చేసిన మహిళలు

February 25, 2020

 

నెలసరి సమయంలో మహిళలపై వివక్ష చూపడం ఇటీవల గుజరాత్‌లో తీవ్ర సంచలనం రేపింది. ఓ వసతి గృహంలో విద్యార్థినులను వంట గదికి దూరంగా ఉండాలని వార్డెన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు స్వామి నారాయణ ఆలయానికి చెందిన కృష్ణస్వరూప్‌ దాస్‌జీ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నెలసరి సమయంలో మహిళలు వంట చేస్తే వచ్చే జన్మలో ఎద్దులుగా పుడతారని, అది తిన్న వారు కుక్కలుగా పుడతారని వ్యాఖ్యానించడంతో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అభ్యుదయవాదులు ఇటువంటి చర్యలను ఖండించారు. 

తాజాగా ఇటువంటి వరుస సంఘటనలు ఆగ్రహాన్ని రగిల్చాయి. దీంతో ఢిల్లీకి చెందిన 28 మంది మహిళలు ప్రజల్లో అనుమానాలు తొలగించేందుకు వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టారు. సచ్చి సహేలి ఫౌండర్ సుర్బి సింగ్ ఆధ్వర్యంలో పీరియడ్ ఫీస్ట్ నిర్వహించారు. నెలసరి సమయంలో వీరంతా వంట చేశారు. సుమారు 500 మందికి సరిపడా ఆహారం తయారు చేసి భోజనాలు చేశారు. తాము వండి వంటలు తిన్న వారికి ఎవరికీ ఏమీ కాలేదని చెప్పారు. నెలసరిలో ఉన్న వారిని అంటరాని వారిగా చూడటం సరికాదని చెప్పారు. నెలసరి సమయంలో వంటచేసి  రుతుస్రావం మహిళగా చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం అంటూ కొటేషన్లు ఉన్నఆఫ్రాన్‌పై రాసుకొని వంట చేశారు. కాగా నెలసరిలో ఉన్న మహిళలు, అమ్మాయిలు.. స్వేచ్చగా ఉండొచ్చని వారు చేసిన వంట ఎవరైనా తినొచ్చని చెప్పడమే తమ ఉద్దేశ్యమని సుర్బి సింగ్ వెల్లడించారు.