Women’s deaths in FP camp: Manickam Tagore Seeks Harish’s resignation
mictv telugu

‘హరీష్‌రావు మంత్రి పదవికి రాజీనామా చేస్తారా?’

September 2, 2022

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు విఫలమై నలుగురు మహిళలు మృతి చెందిన ఘటన దుమారం రేపింది. ఈ ఘటనపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘పోర్చుగల్‌లో భారతీయ గర్భిణి మృతికి బాధ్యత వహిస్తూ అక్కడి వైద్య శాఖా మంత్రి రాజీనామ చేశారు. తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యం కారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న నలుగురు మహిళలు మృతి చెందారు. మరి తెలంగాణ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు మంత్రి పదవికి రాజీనామా చేస్తారా?’’ అంటూ ఠాగూర్ ట్వీట్ చేశారు.

మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు విఫలమై ముగ్గురు మహిళలు మృతి చెందారని.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందంటూ మీడియా వార్తల ఆధారంగా సుమోటోగా కేసును స్వీకరించింది. ఈ ఘటనకు దారితీసిన కారణాలు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తీసుకున్న చర్యలకు సంబంధించి అక్టోబర్‌ 10 నాటికి సమగ్ర నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఇవ్వాలని ఆదేశించింది.

ఇక ఇబ్రహీంపట్నం ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ క్యాంపులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఘటనపై నివేదిక వచ్చే వరకు క్యాంపులను నిలిపివేయాలని ఆదేశించింది. నివేదిక వచ్చాకే కుటుంబ నియంత్రణ క్యాంపుల కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రోజుకు 15 ఆపరేషన్లు మాత్రమే చేయాలని గతంలోనే నిబంధన ఉండగా.. అదేమీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఆపరేషన్లు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఒక్క ఇబ్రహీంపట్నంలోనే గంట వ్యవధిలో 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు డాక్టర్లు.