కేసీఆర్‌తోనే మహిళల అభివృద్ధి: సత్యవతి రాథోడు - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌తోనే మహిళల అభివృద్ధి: సత్యవతి రాథోడు

March 8, 2022

023

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ” కేసిఆర్ నాయకత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో అద్భుతమైన పథకాలు అమలు జరుగుతున్నాయి. మహిళలకు సంబంధించి మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ఒకరోజు సరిపోదు అని మూడు రోజుల పాటు నిర్వహించుకున్నాం. ఈ మూడు రోజులల్లో అనేక మందిని సన్మానించాం” అని ఆమె అన్నారు.

అంతేకాకుండా మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన అవార్డు గ్రహీతలకు అభినందనలను తెలిపారు. ఆనాడు ఎన్టీఆర్ పద్మావతి విశ్వవిద్యాలయం తీసుకొస్తే, నేడు సీఎం కేసిఆర్ ఇక్కడ మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుపై బడ్జెట్‌లో ప్రకటన చేశారని అన్నారు. ఇందుకు మహిళల తరపున తానే స్వయంగా సీఎం కేసిఆర్‌కి ధన్యవాదాలు చెబుతున్నాను అంటూ సత్యవతి రాథోడు స్పష్టం చేశారు.

మరోపక్క ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, మహిళా ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ ఆకుల లలిత, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాస రావు, ప్రభుత్వ సలహాదారు శోభారాణి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, షాద్ నగర్ జడ్పీటీసి రాజమ్మ, స్థానిక కార్పోరేటర్ విజయా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.