మన దేశంలో క్రికెట్ హవా అంతా ఇంతా కాదు. కానీ ఇప్పటివరకు కేవలం పురుష క్రికెట్ మాత్రమే విపరీతమైన ఆదరణ పొందగా, మహిళల క్రికెట్ మాత్రం అక్కడక్కడే ఉంది. కానీ తొలిసారి బీసీసీఐ పురుష ఐపీఎల్ మాదిరిగా మహిళా ఐపీఎల్ నిర్వహించడానికి నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఐదు జట్లకు ఫ్రాంచైజీ బిడ్లను ఆహ్వానించగా, అందులో సంచలనం నమోదైంది. పురుష ఐపీఎల్ ప్రారంభ బిడ్ల ధర కంటే ఎక్కువ విలువ పలకడం క్రికెట్ పండితులను విస్మయానికి గురి చేస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా బుధవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
మొత్తం ఐదు జట్లు రూ. 4 వేల 669.99 కోట్ల వ్యాల్యూ నమోదయ్యిందని ప్రకటించారు. ఇందులో అత్యధికంగా అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ. 1289 కోట్లతో అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. ముంబై జట్టును రూ. 912.99 కోట్లతో ఇండియా విన్ స్పోర్ట్స్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. బెంగళూరు టీంని రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 901 కోట్లు, ఢిల్లీ జట్టును రూ. 810 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్, ఐదవది అయిన లక్నో జట్టును రూ. 757 కోట్ల మొత్తంతో క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. ఇంత మొత్తం పురుష ఐపీఎల్ ప్రారంభమైన 2008లో కూడా రాలేదని జైషా తెలిపారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని, మహిళా క్రికెట్లో విప్లవానికి నాంది పలుకుతుందని జైషా ఆశాభావం వ్యక్తం చేశారు.