మహిళా ఎస్సై అరెస్ట్.. అత్యాచార నిందితుడి నుంచి లంచం తీసుకుని.. - MicTv.in - Telugu News
mictv telugu

మహిళా ఎస్సై అరెస్ట్.. అత్యాచార నిందితుడి నుంచి లంచం తీసుకుని..

July 5, 2020

PSI

ఒక మహిళా పోలీస్ స్టేషన్‌కు ఇంఛార్జ్‌గా ఉన్న మహిళా ఎస్సై కక్కుర్తి పడింది. మహిళలకు అండగా నిలవాల్సిన ఆమె వారికే వెన్నుపోటు పొడిచేలా వ్యవహరించింది.మహిళల జీవితాలతో ఆడుకుంటున్న ఆంబోతులకు కొమ్ము కాచింది. దీంతో ఆమె పాపం పండి కటకటాల వెనకకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అహ్మదాబాద్‌లో లైంగిక దాడికి పాల్పడిన నిందితుల నుంచి రూ.35 లక్షల లంచం తీసుకున్న మహిళా ఎస్‌ఐ శ్వేతా జడేజాను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కేసు నమోదు చేసి ఆమెను కోర్టులో హాజరుపర్చారు. అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన ఇద్దరు మహిళా ఉద్యోగులు కంపెనీ ఎండీ కెనాల్‌ షా తమపై లైంగికదాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీకి చెందిన మరో అధికారి కూడా ఇదే విషయమై అహ్మదాబాద్‌లోని శాటిలైట్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ క్రమంలో మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి శ్వేతా జడేజా.. నిందితుల నుంచి రూ.35 లక్షల లంచం డిమాండ్ చేసింది. డబ్బు ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిందితులను హెచ్చరించింది. కెనాల్ షా సోదరుడు భావేష్‌ను పిలిచి లంచం డిమాండ్ చేసి, రూ.20 లక్షలకు బేరం కుదుర్చుకుంది. అనంతరం ఆ డబ్బు మొత్తాన్ని జమ్‌జోద్‌పూర్‌లో ఎస్సైకి తెలిసిన వ్యక్తికి అందజేశారు. ఈ నేపథ్యంలో కెనాల్‌ షాపై మరో కేసు నమోదైంది. ఎస్సై శ్వేతా జడేజా మరోసారి తన పాచికను ప్రయోగించింది. నిందితుడి సోదరుడి నుంచి రూ.20 లక్షలు డిమాండ్ చేసింది. అయితే అతను రూ.15 లక్షలు ఇస్తానని ఒప్పుకుని ఆ మొత్తాన్ని అందజేశాడు. ఇదే సమయంలో నిందితుడు కెనాల్‌ షాను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో నిందితుడి సోదరుడు భావేష్ అసలు విషయం చెప్పాడు. లంచం ఇచ్చినా అరెస్టు చేయడమేంటని మహిళా ఎస్‌ఐ శ్వేతపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ఎస్సై శ్వేతా జడేజాపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచారు.