బాక్సర్ మేరీకోమ్ సరికొత్త రికార్డ్ - MicTv.in - Telugu News
mictv telugu

బాక్సర్ మేరీకోమ్ సరికొత్త రికార్డ్

October 10, 2019

Women's World Boxing Championships.

భారత మహిళా బాక్సర్ మేరీ కోమ్ సరికొత్త ప్రపంచ రికార్డును సాధించింది. రష్యాలోని ఉలన్ ఉదె వేదికగా జరుగుతున్న వరల్డ్‌ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శనతో సెమీస్‌ చేరింది. ఆమె ఇటీవల 48 కేజీల విభాగం నుంచి 51 కిలోల విభాగానికి మారిన సంగతి తెలిసిందే. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 48 కేజీల విభాగం లేకపోవడంతో మేరీకోమ్ 51 కిలోల కేటగిరీకి మారింది.  51 కిలోల విభాగంలో ఆడిన మొదటి టోర్నీలోనే అదరగొట్టింది. గురువారం కొలంబియాకి చెందిన బాక్సర్ ఇంగ్రీట్‌ని 5-0 తేడాతో ఓడించింది. ఈ టోర్నీలో సెమీస్‌కి చేరడంతో మేరీకోమ్‌కి కనీసం కాంస్య పతకం ఖాయమైంది. దీంతో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పతకాలు సాధించిన బాక్సర్‌గా మేరీకోమ్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. 

గత ఏడాది క్యూబాకి చెందిన బాక్సర్‌ పెలిక్స్ ఏడు పతకాల రికార్డ్‌ని సమం చేసిన మేరీకోమ్..ఈరోజు కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకోవడం ద్వారా 8 పతకాలతో రికార్డ్‌ సొంతం చేసుకుంది. మేరీకోమ్ తన కెరీర్‌లో ఇప్పటికే 6 స్వర్ణాలు, ఒక రజత పతకం గెలుపొందింది. తాజాగా కనీసం కాంస్యంతో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌‌షిప్‌లో 8 పతకాల్ని సాధించిన తొలి బాక్సర్‌గా రికార్డ్‌ నెలకొల్పింది. ఈ టోర్నీలో భాగంగా సెమీస్‌లో ఇక మేరీకోమ్ శనివారం టర్కీకి చెందిన బుసెంజాతో పోటీపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కి చేరితే బంగారం లేదా రజతం గెలిచే అవకాశాలుంటాయి. ఒకవేళ సెమీస్‌లో ఓడిపోయినా.. మేరీకోమ్‌కి కాంస్యం లభిస్తుంది.