పనే ముద్దు.. బిచ్చగాడి బిజినెస్.. వీడియో చూడండి - MicTv.in - Telugu News
mictv telugu

పనే ముద్దు.. బిచ్చగాడి బిజినెస్.. వీడియో చూడండి

March 17, 2019

శరీరంలో అన్నీ అవయవాలు బాగున్నవాళ్లు అడుక్కు తింటే వాళ్లకు దానం చేయటానికి అసహ్యంగా వుంటుంది. ‘గాడిదలా వున్నావు.. ఏమైనా పని చేసుకు చావొచ్చుగా’ అని కొంతమంది దానకర్ణులు అలాంటివాళ్ళకు హితబోధ చేస్తారు. కానీ పట్టించుకుంటారా అనేది డాలర్ల క్వశ్చన్ ? కాళ్లు, చేతులు బాగుండి, యవ్వన స్థితిలో వుండి చక్కగా ఒళ్లు వంచి పని చేసుకోకుండా కొందరు పనికి చేతకానివాళ్లు భిక్షాటన చేస్తుంటారు. ఇలాంటివాళ్ల వల్ల అర్హతగల బిచ్చగాళ్లకు అన్యాయం జరుగుతుందనే చెప్పాలి.

ఈ క్రమంలో మీ మైక్ టీవీ ఓ చక్కని వీడియో చేసింది. ‘బిచ్చగాడి బిజినెస్’ పేరిట ఓ సందేశాత్మక వీడియోను తీసుకువచ్చింది. మోహన్ పిఐ దర్శకత్వంలో వచ్చిన ఈ షార్ట్‌ఫిల్మ్ అలాంటివాళ్ళకు చక్కని మెసేజ్ ఇస్తోంది. ఓ బిచ్చగాడు ఒళ్లన్నీ కాటన్ పట్టీలు చుట్టుకుని ‘అమ్మా.. అయ్యా.. ధర్మం చెయ్యండి.. కాలు మీదికెల్లి రైలు పోయింది.. చెయ్యి మీదికెల్లి బస్సు పోయింది.. తల్కాయ మీదికెల్లి విమానం పోయింది’ అని సింపతీ డైలాగ్ కొడతూ యాచిస్తుంటాడు. అతణ్ణి చూసినవాళ్లు తమకు తోచినంత దానం చేసి వెళ్తుంటారు. కొందరు తిట్టేసి వెళుతుంటారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వచ్చి అతని పక్కన కూర్చొని పెన్సిళ్లు, పెన్నులు అమ్ముకునే వ్యాపారం చేసుకుంటుంటాడు. అతని వ్యాపారం గురించి అడిగి తెలుసుకుంటాడు. కట్ చేస్తే అతను భిక్షాటనకు బైబై చెప్పి పెన్సిళ్లు, పెన్నులు అమ్మే చిన్న వ్యాపారం పెట్టుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు.

శారీరక లోపాలు వున్నవాళ్లు, ముసలివాళ్లు అడుక్కుంటే బాగుంటుంది కానీ, శరీరంలోని అన్నీ అవయవాలు బాగుండి అడుక్కోవడం బాగోదు.. ఏదైనా పని చేసుకుని బతకాలి.. అని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. బిచ్చగాడిగా మిట్టు నటించాడు. మిగతా పాత్రల్లో నరసింహ, రాజు, మేఘ్‌రాజ్, సురేష్, ప్రసాద్‌లు నటించారు. కెమెరా చిన్నా కొత్వాల్ అందించారు. ఎడిటింగ్ ఉదయ్ కుంభం చేశారు. క్రింది లింకులో మీరు కూడా ఈ వీడియోను చూడొచ్చు.