బట్టల షాపులో జీతం లేకుండా పనిచేస్తున్న ఆవు! - MicTv.in - Telugu News
mictv telugu

బట్టల షాపులో జీతం లేకుండా పనిచేస్తున్న ఆవు!

October 30, 2019

మీకొక చిత్రమైన ఆవును పరిచయం చేస్తున్నాం. నల్లగా, తెల్లగా, ఎరుపు రంగులో ఉండే ఆవులను చూశాం కానీ, చిత్రమైన ఆవా అని ఆశ్చర్యపోకండి. అది చేసే చిత్రమైన పని గురించి తెలిస్తే మీరు దానికి చిత్రావు అని అనేస్తారు. ఇంతకీ అది ఏం చేస్తోందంటే.. క్రమం తప్పకుండా అది ఓ బట్టల దుకాణంలోకి వెళ్తుంది. వెళ్లి అక్కడ అల్లరిచేస్తుందేమో అనుకునేరు. అలాంటి అల్లాటప్పా పనులేవీ చెయ్యకుండా బుద్ధిగా వెళ్లి అక్కడున్న పరుపుపై కూలబడి ఓ రెండు మూడు గంటలు చక్కగా సేదదీరుతుంది. ఆలోపు వచ్చే కష్టమర్లు వస్తుంటారు.. పోయే కష్టమర్లు పోతుంటారు. ఇవేవీ తనకు అవసరం లేదు. పైనుంచి వీస్తున్న ఫ్యాన్ గాలికి హాయిగా బయట తినివచ్చిన గడ్డిని నెమరు వేసుకుంటూ ఉండిపోతుంది. 

వెంటనే ఆ గోమాతను చూడాలని ఉంది కదూ. అయితే మీరు వెఎస్సార్ కడపజిల్లా మైదుకూరుకు వెల్లవలసిందే. పట్టణంలోని సాయిబాబా క్లాత్ మార్కెట్‌లోని పోలిమేర ఓబయ్య అనే వ్యక్తి కి చెందిన సాయిరాం వస్త్ర దుకాణంలోకి ప్రతిరోజు ఆ ఆవు అతిథిలా వచ్చేస్తుంది. ఆ సమయంలో షాపులో ఎందరున్నా.. ఎవరైనా అడ్డుకున్నా ఆగకుండా లోపలికి వెళ్లి కోనుగోలుదారుల కోసం వేసిన మెత్తటి పరుపులపై వాలిపోతుంది. ఇలా దాదాపు ఆరేడు నెలలుగా ప్రతీ రోజు వచ్చి షాపులో సేదతీరుతోందని యజమాని తెలిపాడు. మెదట్లో వ్యాపారం దెబ్బ తింటుందని యజమాని ఓబయ్య ఎంత బైటకు తోలడానికి ప్రయత్నించినా అక్కడ నుంచి వెళ్లక పోవడంతో కొంత ఆందోళన చెందినట్లు యజమాని ఓబయ్య తెలిపారు.

అయితే క్రమేపి ఆవు వచ్చినా కష్టమర్లకు ఇబ్బంది కలిగించక సేద తీరుతుండటంతో యజమానితో పాటు సిబ్బందికి వచ్చిన కోనుగోలు దారులకు అలవాటు అయింది. షాపులో ఉన్నంత సేపు మూత్రం పోయడం పేడ వేయడం వంటివి చేయదని ఏదైనా ఆహరం అందిస్తే తీసుకుంటుందని షాపు యజమాని వెల్లడించారు. ఈ ఆవు వస్తుండటంతో తమ షాపు గురించి ఆందరికీ తెలిసి వస్తున్నారని.. దీంతో తమ వ్యాపారం కూడ అభివృద్ధి చెందిందని ఓబయ్య ఆనందం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఓబయ్య సతీమణి కూడ ఆవుకు పూజలు చేస్తున్నారు.