ప్రపంచంలోనే అతిపెద్ద జైలు అందుబాటులోకి వచ్చేసింది! ఏకంగా ఓ చిన్న మునిసిపాలిటీలోని జనాభా పట్టేంత పెద్ద జైలు అది. దక్షిణ అమెరికా ఖండంలోని ఎల్ సాల్వెడార్ దేశంలో దీన్ని నిర్మించారు. కరడుగట్టిన నేరస్తుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఒక ఊరిగా, ఏదో పెద్ద పారిశ్రామికవాడలా కనిపిస్తున్న ఈ జైలు చిత్రాలు బయటికి వచ్చాయి. ఇందులో 40వేల మంది ఖైదీలను బంధిస్తారు.
తొలి విడతగా 2వేల మందిని గూండాలను పట్టుకొచ్చి వదిలేశారు. ఒళ్లంతా పచ్చబొట్లతో, బోడిగుండ్లతో, ఒంటిపై లాగులు తప్ప మరేమీ లేని ఈ ఖైదీల మంద ఏదో కోళ్లఫారం, గొర్రెల ఫారం దృశ్యాలను తలపిస్తోంది. హత్యలు, దాడులు వంటి ఘోర నేరాలకు పాల్పడే గ్యాంగ్‌స్టర్లను ఇందులో పడేశారు. ప్రజలకు గట్టి భద్రత కల్పించేందుకు వీరిని పడక్బందీ ఏర్పాట్లున్న ఈ జైలుకు తెచ్చామని అధికారులు చెప్పారు.
జైలు ప్రత్యేకతలు
దేశ రాజధాని సామ్ సాల్వడార్‌కు ఆగ్నేయ దిశగా 74 కి.మీ. దూరంలోని తెకోలూకాలో ఈ జైలు కట్టారు. మొత్తం 8 భారీ భవనాలు ఉన్నాయి. ఒక్కో భవనంలో 32 సెల్స్ ఉన్నాయి. ఒక్కో సెల్ విస్తీర్ణం 1075 అడుగులు. అందులో వందమందిని కుక్కుతారు. ఒక్కో సెల్లో రెండు టాయిలెట్లు, రెండు సింకులే ఉంటాయి. వందమంది వాటిని వాడుకోవాలి. ఖైదీల కదలికలను నిత్యం సీసీ కెమెరాల్లో గమనిస్తుంటారు.
జైలు సిబ్బంది శక్తిమంతమైన మెషిన్ గన్లు, మాంచి లాఠీలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు ఇచ్చారు. ఖైదీలు తిరగబడితే రెండో మాటకు తావులేకుండా అక్కడికక్కడే సఫా చేసేలా ఉన్నాయట నిబంధనలు. ఖైదీలు అక్కడి నుంచి తప్పించుకోవడం ఏమాత్రం సాధ్యం కాదు. అక్కడికి వెళ్తే యమలోకానికి వెళ్లినట్లే అన్నట్లు కంచెలు, గోడలు అన్నీ బలంగా ఉన్నాయట. 65 లక్షల జనాభా ఉన్న ఎల్ సాల్వడార్‌లో 2 శాతం మందికిపైగా అంటే 1.30 లక్షల మంది జైల్లలో మగ్గుతున్నారు. ఎల్ సాల్వరాడ్ ప్రపంచ నేర రాజధానిగా ప్రఖ్యాతి గాంచింది.