World Economic crisis, india trend, companies lay offs, job loss, unemployment
mictv telugu

ఆర్థిక సంక్షోభం వస్తోందా? ఆల్రెడీ వచ్చేసిందా?

November 22, 2022

World Economic crisis india trend

పెద్దపెద్ద కంపెనీలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. లక్షల కోట్ల సంపద షేర్ మార్కెట్ ఒడిదొడుకులకు హారతి కర్పూరంలా కరిగిపోతోంది. అమెజాన్, ఫేస్‌బుక్, ట్విటర్, జొమాటో.. మరెన్నో బహుళజాతి, దేశీ సంస్థలు వేలమంది ఉద్యోగులను శాశ్వతంగా ఇంటికి పంపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభమే దీనికి కారణమంటున్నారు విశ్లేషకులు. అయితే విపత్తు ఇప్పటికే ఉందని, ముందున్నది ముసళ్ల పండగని మరికొంతమంది మాట.

పడిపోతున్న ఆదాయాలు..

చాలా కంపెనీలకు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య భారీగా పడిపోతున్న ఆదాయం. భారీగా వ్యాపారం సాగుతుందని, భారీ లాభాలు వస్తాయని చాలా కంపెనీలు పరిమితికి మించి ఉద్యోగులను నియమించుకున్నాయి. బూమ్‌లో అనుకున్నది కాస్త నెరవేరినా దేనికైనా ఒక హద్దు ఉంటుంది కనుక ఆదాయాలు భారీగా పడిపోయాయి. ఎన్ని వ్యూహాల్లో ఎంత కసరత్తు చేసినా జనం దగ్గర్నుంచి పిండుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఒకపక్క ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయి. మనదేశంలో నిరుద్యోగం ఎన్నడూలేనంత గరిష్ట స్థాయికి చేరుకుంది. సెప్టెంబర్ నెలలో 6.4 శాతంగా ఉన్న నిరుద్యోగిత పెరుగుదల రేటు అక్టోబరులో 7.8 శాతానికి చేరింది. గ్రామీణ ప్రజలు ఉద్యోగాలు కోల్పోతున్నారు. అమెరికాలో కూడా పెరుగుదల నమోదైంది. వీటికి తోడు అవినీతి, ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా శాపగా మారాయి. 10 లక్షల కోట్ల రుణాలను భారతీయ బ్యాంకులు రద్దు చేయడం వెనక ఏం జరిగిందో చాలా సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఉపాధి, వ్యాపార అభివృద్ధి పేరుతో రుణాలు తీసుకున్న కంపెనీలు ఆ సొమ్మును పక్కదారి పట్టించాయి.

కరోనా దెబ్బకు విలవిల..

పాశ్చాత్య దేశాలను దెబ్బతీసి తను బాగుపడాలనే చైనా కరోనా వైరస్‌ను సృష్టించిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అందులో ఎంత నిజముందో వదిలేస్తే.. కోవిడ్ దెబ్బ సామాన్య ప్రజల నడ్డి విరిచింది. ఉద్యోగాలు కోల్పోవడం, ఖర్చులు, అప్పులు పెరగడం వల్ల జనం దగ్గర భారీ కొనుగోళ్లు చేసే పరిస్థితి లేదు, పొదుపు చేసుకున్న సొమ్మును పిల్లల చదువులు, ఆరోగ్యం వంటి అవసరాలకోసం జాగ్రత్తగా వాడుకోవడంతో కొనుగోళ్లు ఆశించనంత స్థాయిలో లేవు. చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. మన దేశంలో జీఎస్టీ మోత తెలిసిందే. డబ్బున్నవాళ్లు ఎప్పుడూ ఖర్చుచేస్తుంటారు. అయితే ఆర్థిక వ్యవస్థ బలంగా నిలదొక్కుకోవాలంటే ఆర్థిక వ్యవస్థ అట్టడుగున్న ఉన్న ప్రజలు కూడా కొనుగోళ్లు చేయాల్సి ఉంటుంది. కరోనా, నిరుద్యోగం, పేదరికంతోపాటు కార్లు, ఫోన్లు, బట్టలు వంటి షోయింగ్ వస్తువులపై కాకుండా స్థిరమైన ఆదాయం, భవిష్యత్తుకు భరోగా ఇచ్చే చదువు, స్థిరాస్తి వంటివాటిపై జనం ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా కంపెనీల వ్యాపారం తగ్గిందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముందుముందు మరింత గడ్డు పరిస్థితి వస్తుందని, ప్రజలు కార్లు, ఖరీదైన ఫోన్లు కొనకూడదని స్వయంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ హెచ్చరించాడంటే పరిస్థితి ఎలా ఉందో అంచనాకు రావచ్చు.