ఉప్పు, కారం, నూనెలు బాగా తగ్గించాలని వైద్యులు తరచూ చెబుతుంటారు. రుచీపచీ లేకుండా చెత్త తిన్నట్లు ఎలా తింటాం బాసూ అంటూ చాలామంది పట్టించుకోరు. రుచి కాస్తా ప్రాణాల మీదికి వచ్చాక తీరిగ్గా ఆలోచిస్తుంటారు. అదొకటైతే ఉప్పు ఎంత మోతాదులో తీసుకోవాలనన్నదానిపై చాలామందికి అవగాహన లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కొన్ని సూచనలు జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయని, దీనికి ఉప్పును అధికంగా పుచ్చుకోవడమేనని ఆందోళన వ్యక్త చేసింది. సంస్థ సూచనలు ఇలా ఉన్నాయి..
– ఉప్పు అధికంగా వాడడం వల్ల గుండెపోట్లు వస్తున్నాయి. సోడియం(ఉప్పు) ఎక్కువైతే గుండెపోటు మాత్రమే కాకుండా స్థూలకాయం, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, ఎముకలు డొల్లగా మారడం వంటి వ్యాధులు వస్తాయి.
– 2025 నాటికి ఉప్పు వాడకాన్ని తగ్గించాలన్న ఆశయం సరిగ్గా ఫలించడం లేదు. ఉప్పు తగ్గిస్తే 2030 నాటికి 70 లక్షల మంది ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
– ఒక మనిషి రోజుకు సగటున 5 గ్రాముల ఉప్పు మాత్రమే వాడాలి. కానీ ఇప్పుడు 10.8 గ్రాములు వాడుతున్నారు.
– ఉప్పు మోతాదు మించితే రక్తపోటు పెరుగుతుంది. శరీరం కాల్షియం కోల్పోతుంది.
– కూరలు, పచ్చళ్లు, ఆహార పదార్థాలు వంటి పదార్థాల వల్ల మనం రోజూ ఇరవై గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాం.