ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద విద్యుదుత్పత్తి ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండాలో ఇంటిగ్రేటెడ్ పవర్ జనరేషన్ ప్లాంటుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు మోడల్ పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు.
15 వేల కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టు ద్వారా 23 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఒకే ప్రాజెక్టులో సోలార్, విండ్, హైడల్ పవర్లను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు విశిష్టత. 5,230 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి దీని లక్ష్యం. సోలార్ విద్యుత్ ఉత్పత్తి 3000 మెగావాట్లు, విండ్ 550 మెగావాట్లు, హైడల్ పవర్ 1860 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్ నిర్మిస్తున్నఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుదుత్పత్తి ప్రాజెక్టు. 4,766 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ప్లాంటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2,800 ఎకరాలను అప్పగించింది. ఐదేళ్లలో పూర్తయ్యే ఈ ప్లాంటు నుంచి మొత్త 5,410 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నేషనల్ గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. ఓర్వకల్లు పీజీసీఐఎల్, సీటీయూ విద్యుత్ సబ్ స్టేషన్ ద్వారా దేశంలోని విద్యుత్ పంపిణీ సంస్థలకు, పరిశ్రమలకు అందజేస్తారు.