ఆసీస్‌తో నాలుగో టెస్ట్ ఫలితంతో సంబంధం లేకుండా టీమిండియా దర్జాగా ఫైనల్‌కు చేరింది. ఈ ఏడాది జూన్ 7 నుంచి 11 వరకు లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఓ వైపు బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల సిరీస్ జరుగుతుండగానే.. టీమిండియా దర్జాగా ఫైనల్‌కు చేరింది. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్.. అహ్మదాబాద్ వేదికగా చివరి టెస్టులో ఆడుతోంది. అయితే ఈ నాలుగో టెస్ట్ ఫలితంతో సంబంధం లేకుండా టీమిండియా ఫైనల్‌లో ఆడబోతుంది. ఇందుకు సాయం చేసిందెవరో తెలుసా న్యూజిలాండ్ టీమ్.
ఎలాగంటే..
న్యూజిలాండ్ లో శ్రీలంక , న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం ప్రారంభమైన మ్యాచ్‌లో డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్‌కు చేరాలనుకున్న శ్రీలంక ఆశలపై న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నీళ్లు చల్లాడు. సూపర్ సెంచరీ సాధించిన కేన్ మామ (121), తన జట్టుకు అపురూప విజయాన్ని అందించడంతో పాటు శ్రీలంకను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకున్నాడు. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి టెస్ట్‌లోనే లంక ఓటమిపాలైంది. దీంతో ఆస్ట్రేలియాతో ఫైనల్ ఆడేందుకు భారత్తో పోటీ పడ్డ శ్రీలంక చతికిలపడ్డట్టు అయింది. న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో శ్రీలంక ఓడిపోవడం వల్ల ఫైనల్ ఆశలను చేజార్చుకుంది. దీంతో టీమిండియా ఫైనల్ బెర్త్ ను కన్ఫామ్ చేసుకుంది. జూన్ 7నుంచి జరగబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది టీమ్ఇండియా.