హైదరాబాదులో ప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణం జరగబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కపిల్ గ్రూపు శంషాబాద్లో 60 ఎకరాల విస్తీర్ణంలో భవనాలను నిర్మించనుంది. ఇప్పటివరకు ఢిల్లీలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ విస్తీర్ణంలో (44 ఎకరాల్లో) ప్రపంచంలోనే పెద్దది కాగా, రెండో స్ధానంలో బీజింగ్ (43 ఎకరాలు) ఉంది. ఇప్పుడు వాటిని తలదన్నేలా హైదరాబాదులో నిర్మించనుండడంతో నగరానికి మరో ఆకర్షణగా నిలవనుంది. అయితే ఎయిర్ పోర్టు ఉండడం వలన కేవలం 12 అంతస్తుల వరకు మాత్రమే అనుమతి ఉంది. దీనికి అనుబంధంగా సర్వీస్ అపార్ట్మెంట్లతో పాటు 225 గదులతో హోటల్ కూడా కట్టనున్నారు. సుమారు రూ. 4 వేల కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు స్థల సేకరణ జరగగా, నిర్మాణాలు ప్రారంభ దశలో ఉన్నాయి. 2025 నాటికి మొదటి దశ, 2035 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. అటు విశాఖలో కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. రిషికొండ సమీపంలో 20 లక్షల చదరపు అడుగులలో సెంటర్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం అయింది.