రెండవ ప్రపంచం నాటి బాంబులు కొన్ని ఇప్పటికీ భూమిలో ఉండిపోయాయి. అప్పుడప్పుడు తవ్వకాల్లో అవి బయట పడుతుంటాయి. తాజాగా రెండవ ప్రపంచ యుద్ధానికి చెందిన భారీ బాంబు పోలాండ్ నదీలో బయట పడింది. టాల్బాయ్ గా పిలిచే ఈ బాంబు దాదాపు 5400 కిలోలు ఉంటుందని అక్కడి నౌకాదళ అధికారులు తెలిపారు. మంగళవారం ఈ బాంబును నిర్వీర్యం చేస్తుండగా పేలుడు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తీ నష్టాలు జరగలేదని తెలిపారు.
1945 నాటి రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ యుద్ధ నవక లుట్జోపై బ్రిటన్ రాయల్ వాయుసేన ఈ బాంబును వదిలింది. అప్పటినుంచి ఈ బాంబ్ పోలాండ్ లో ఉండి పోయింది. దీనివల్ల ఎప్పటికైన ప్రమాదం జరిగే అవకాశం ఉందనే భావించిన అక్కడి అధికారులు నిర్వీర్యం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో స్వీనోజ్సై ప్రాంతంలోని పియూస్ట్ కాలువలో నిర్వీర్యం చేయడానికి తీసుకెళ్లారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది దానిని నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలింది. దీన్ని నిర్వీర్యం చేసే సమయంలో నది సమీపంలో నివసించే 750 మందిని అక్కడి నుంచి తరలించారు. ఈ పేలుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.