భారత్‌లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వలస కూలీలు సొంత గ్రామాలకు వెళ్లడం ప్రారంభమైనప్పటి నుంచి వైరస్ వ్యాప్తి మరంత ఎక్కువ అయ్యింది. తాజాగా గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిన్న ఒక్కరోజే 3,772 మందికి లక్షణాలు బయటపడగా.. 134 మంది మరణించారు. దీంతో కేసుల సంఖ్య 78,003కు చేరింది. 2,549 మహమ్మారికి బలయ్యారు. ఇప్పటి వరకు 26,235 మంది కోలుకోవడంతో ఇంకా 49,219 మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే రికవరీ రేటు మెరుగుపడుతోందని అధికారులు చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,428,236 మందికి చేరింది. వీరిలో 298,083 మంది మరణించారు, 1,657,905 మంది కోలుకున్నారు. అమెరికా, స్పెయిన్,యూకే దేశాల్లో వైరస్ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక్క అమెరికలోనే 13 లక్షల మందికి వ్యాధి సోకింది.
గత 24 గంటల్లో 82,643 మందికి కొత్తగా వ్యాధి సోకింది. 5,157 మరణాలు సంభవించాయి. యూఎస్‌లో 1,599, బ్రెజిల్ 881,బ్రిటన్‌లో 494 చనిపోయారు. వైరస్ వ్యాప్తిలో అమెరికా తర్వాత బ్రిటన్ రెండో స్థానంలో ఉంది. అక్కడ 229,705 కేసులు బయటపడగా.. 33,186 మంది మరణించారు.