విదేశాలలో ఉండాలనుకునే వారికి ఏ దేశం, నగరం అయితే కంఫర్ట్ గా ఉంటుంది. ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళందరూ యూఎస్ కో, యూకే కో ఎక్కువగా వెళుతుంటారు. అయితే ఇవి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నాయా అంటే డౌటే. ప్రవాసీలకు అనుకూలంగా ఉండే నగరాల ఏంటి? అనేది తెలుసుకోడానికి ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న దాదాపు 12 వేల మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ అభిప్రాయాల ఆధారంగా నివేదిక రూపొందించిన ఆ సంస్థ.. ర్యాంకింగ్‌ను ఇచ్చింది. ఇందులో టాప్ 10 లో స్పెయిన్, దుబాయ్ నుంచి రెండేసి నగరాలు ఉన్నాయి. ఇక, తొలి స్థానంలో అనూహ్యంగా స్పెయిన్ నగరం నిలిచింది.
ప్రవాసులకు నివాసాయోగ్యం, పని చేయడానికి అత్యంత అనువైన నగరాల జాబితాలో స్పెయిన్‌కు చెందిన వాలెన్సియా అగ్రస్థానం దక్కించుకుంది.ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన నగరాలు మూడు వేర్వేరు ఖండాలకు చెందినవి కావడం విశేషం. ఇంటర్నేషన్స్ అనే సంస్థ ఆయా దేశాల్లో నివసిస్తున్న ప్రవాసులను సర్వే చేసి ‘ఎక్స్‌ప్యాట్ సిటీ ర్యాంకింగ్ లిస్ట్ 2022’ను రూపొందించింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన వాలెన్సియాలో జీవన ప్రమాణాలు, ప్రజా రవాణా, క్రీడా అవకాశాలు మెరుగ్గా ఉన్నట్టు సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.
స్పెయిన్ తర్వాతి స్థానంలో దుబాయ్ నిలిచింది. కొత్తగా వచ్చేవారికి ఘన స్వాగతం పలుకుతుందని సర్వేలో వెల్లడించారు. అలాగే, అత్యంత అందుబాటు ధరల్లో నివసించడానికి అనువుగా నగరంగా మెక్సికో సిటీ మూడోస్థానంలో నిలిచింది. 50 నగరాలతో కూడిన ఈ జాబితాలో దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్నెస్‌బర్గ్ అట్టడుగున నిలిచింది. భద్రత లేకపోవడంతో పాటు చాలా ఖరీదైన నగరమని సర్వేలో పాల్గొన్న ప్రవాసులు తెలిపారు. కింది నుంచి రెండో స్థానంలో జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్, మూడో స్థానంలో ఫ్రాన్స్ రాజధాని పారిస్ ఉన్నాయి. ఈ రెండు నగరాల్లో ఇళ్ళు అత్యంత ఖరీదైనవి అని చెబుతున్నారు. అమెరికాలోని మియామీ 12వ స్థానం, న్యూయార్క్ 16, కెనడాలోని టొరంటో 19వ స్థానంలో నిలవగా.. యూకే రాజధాని లండన్ 40వ స్థానానికి పరిమితం కావడం గమనార్హం.
ఆసియా ఖండంలో బ్యాంకాక్ తక్కువ ఖర్చుతో నివసించదగిన నగరాల జాబితాలో ఆరో స్థానంలో, సింగపూర్ పదో స్థానంలో నిలిచాయి. ఇక, పని సమతౌల్యత మెల్బోర్న్లో బాగుంటుందని సర్వేలో పాల్గొన్నవారు చెప్పడంతో ఈ నగరం 8వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 181 దేశాల్లో నివసిస్తున్న 11,970 మంది ప్రవాసుల్ని సర్వే చేసి ఇంటర్నేషన్స్ ఈ జాబితాను విడుదల చేసింది.