కరోనాతో లాభం కూడా.. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్న కంపెనీలు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాతో లాభం కూడా.. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్న కంపెనీలు

February 3, 2020

Work From Home.

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తోంది. ఆ దేశం నుంచి ఈగ వచ్చినా ఇక్కడ వణికిపోతున్నారు. అక్కడి మనుషులు ఇతర దేశాలకు వెళితే పకడ్బందీగా  ఆరోగ్య పరీక్షలు పూర్తి చేసి మరీ అనుమతిస్తున్నారు. జలుబు, నీరసం వంటివి వచ్చినా కరోనా అనుమానంతో ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. మనవద్దే ఇలా ఉంటే ఇంక చైనాలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఇప్పటికే అక్కడ కొందరు తమ పెంపుడు జంతువులను అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. వాటివల్ల కరోనా సోకుతుందనే భయంతో పిల్లులు, కుక్కలను బహుళ అంతస్థుల మీదనుంచి తోసి చంపేస్తున్నారు. 

మరోవైపు ఉద్యోగస్తులు ఆఫీస్‌లకు  భయంభయంగా వెళుతున్నారు. పలు సంస్థలు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.  ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కాన్సెప్ట్‌తో ఉద్యోగులకు ఊరటనిస్తున్నాయి. ఈ కాన్సెప్టు పూర్తిస్థాయిలో ఆచరణలోకి వస్తే.. ప్రపంచంలోనే అతిపెద్ద ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రయోగంగా చైనా నిలవనుంది. షాంఘై, బీజింగ్, ఇతర ప్రాంతాల్లో కరోనా ప్రభావంతో చాలా మంది ఉద్యోగుల సెలవులను ఫిబ్రవరి 10 వరకు పొడిగించారు. దీంతో ఇంటి నుంచే పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రిప్రైజ్ డిజిటల్ అనే యాడ్ ఏజెన్సీ ఎండీ ఆల్విన్ ఫూ మాట్లాడుతూ.. ‘వర్క్ ఫ్రమ్ హోమ్‌తో లాభ నష్టాలు బేరీజు వేసేందుకు ఈ పరిస్థితులు ఓ చక్కని అవకాశం కల్పిస్తున్నాయి. మా సంస్థలో 400 మంది సిబ్బంది ఉన్నారు. మాలాంటి యాడ్ ఏజెన్సీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కొంచెం ఇబ్బందికరమే. అయితే ఫోన్ కాల్స్ .. వీడియో చాట్స్‌పై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఒకవేళ ఇదే గనుక పూర్తిస్థాయిలో కొనసాగితే.. అతిపెద్ద ప్రయోగాత్మక విధానంగా రికార్డులకు ఎక్కనుంది’  అని తెలిపారు.