'World's dirtiest man' dies at 94 after first bath in over 60 years
mictv telugu

60 ఏళ్లుగా స్నానమే చేయని వ్యక్తి.. బలవంతంగా చేయించేసరికి

October 26, 2022

ప్రపంచంలోనే అత్యంత మురికైన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఇరాన్‌కు చెందిన వృద్ధుడు అమౌ హజీ మృతి చెందాడు. 94 ఏండ్ల ఆ వృద్ధుడు గత 60 ఏండ్లలో ఒక్కసారి కూడా స్నానం చేయలేదు. సుమారు ఆరు దశాబ్దాలుగా పరిశుభ్రతకు దూరంగా ఉన్న అతడు అక్టోబరు 23న మృతి చెందినట్లు ఇరాన్‌ మీడియా పేర్కొంది. ఇరాన్‌ దక్షిణ ప్రావిన్సు ఫార్స్‌లోని డెజ్‌గా గ్రామంలో ఒంటరిగా నివసించే అమౌ హజీకి కుటుంబీకులు ఎవ్వరూ లేరు. గ్రామస్థులే దయతలచి ఆయన తలదాచుకునేందుకు చిన్న ఆవాసాన్ని ఏర్పాటు చేశారు.

పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యం బారినపడతానన్న భయంతో స్నానాన్ని మానేసిన హజీ.. సబ్బుతో ముఖం, కాళ్లు చేతులు కూడా ఎప్పుడూ కడుక్కోలేదు. చనిపోయిన మూగజీవాలను తింటూ బతికేవాడు. ఒకేసారి నాలుగైదు సిగరెట్లను ఊదిపడేసేవాడు. స్నానం లేకుండా వింత జీవితాన్ని గడుపుతున్న హాజీపై 2013లో ఓ డాక్యుమెంటరీ కూడా వచ్చింది. అటువంటి వ్యక్తికి గ్రామస్థులందరూ కలిసి కొన్ని నెలల కిందట బలవంతంగా స్నానం చేయించారు. అలా జరిగిన కొన్నిరోజులకే హజీ కన్నుమూయడం గమనార్హం.