కారులో ప్రయాణించినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఎయిర్ బ్యాగులు ఓపెన్ అయి కొంతవరకు రక్షించబడుతారు. అదే బైక్ పైన వెళ్లే వారి పరిస్థితి ఏంటి? అందుకే ఒక కంపెనీ ఎయిర్ బ్యాగ్ ఫీచర్ తో ఉన్న జీన్స్ డిజైన్ చేసింది.
బైక్ నడుపుతున్నప్పుడు మన పరిరక్షణ అనేది పెద్ద ఆందోళన. తలకు అంటే హెల్మెట్ ధరిస్తాం. ఆ తర్వాత ఎక్కువ దెబ్బలు తగిలే ప్రాంతం కాళ్లు. మరి వాటికి రక్షణ అంటే మాత్రం ఆలోచించాల్సిందే! అదే కారులో ఉంటే చాలావరకు సురక్షితంగా ఉంటారు. అందులో అనేక భద్రతా ఫీచర్లు ఉంటాయి. బైక్లకు అలా ఎయిర్ బ్యాగులు పెట్టడానికి కుదరదు. అందుకే మనకే ఆ ఎయిర్ బ్యాగ్స్ ఉంటే మేలని ఒక స్వీడిష్ కంపెనీ ఆలోచించింది. ఒక జీన్స్ ను విడుదల చేసింది.
ఏంటి ఈ జీన్స్?
స్వీడిష్ బ్రాండ్ మో’సైకిల్ ఎయిర్ బ్యాగ్ ఫీచర్ తో ఉన్న ఒక జీన్స్ ను డిజైన్ చేసింది. బైక్ రైడర్ కింద పడిన కొన్ని సెకన్లలో ఈ జీన్స్ ఊడిపోయి లోపల ఉన్న ఎయిర్ బ్యాగులు తెరుచుకుంటాయి. దీనివల్ల మనం కింద పడినప్పుడు అవి రక్షణ కల్పిస్తాయి. ఇవి చూడడానికి సాధారణ జీన్స్ ప్యాంట్స్ మాదిరిగానే కనిపిస్తాయి. అయితే వీటికి మాత్రం ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్ ను ఉపయోగించారు. దీనివల్ల మనకు ఎలాంటి అసౌకర్యం కూడా ఉండదు. పైగా ఈ జీన్స్ లో CO2(కార్బన్ డయాక్సైడ్) క్యాట్రిడ్జ్ ఉంటుంది. దీన్ని మార్చుకోవచ్చు.
ఎలా రక్షణ..?
ఈ జీన్స్ గురించి మీకు కొన్ని సందేహాలు వచ్చే ఉంటాయి. ముందుగా ఈ జీన్స్ ధరించాలి. ఆ తర్వాత అందులో వచ్చిన స్ట్రిప్ ను బైక్ లోని ఏదైనా భాగానికి షాకర్, ఫ్రేమ్ లేదా ఫుట్ రెస్ట్ వంటి వాటికి కట్టాలి. బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే ఈ స్ట్రిప్ నుంచి ఎయిర్ బ్యాగ్ విడదీయబడుతుంది. ఎయిర్ బ్యాగ్ తెరుచుకొని వెంటనే మీరు ప్రమాదం నుంచి బయటపడతారన్నమాట. అందరికీ మరొక సందేహం కూడా వచ్చే ఉంటుంది. మరి దీనిని ఉతకడం ఎలా అనేగా మీ సందేహం. దీంట్లో నుంచి ఎయిర్ బ్యాగ్ మాడ్యూల్ తీసేస్తే ఇది మామూలు జీన్స్ అన్నమాటే. మామూలు డెనిమ్ జీన్స్ లాగానే దీన్ని కూడా ఉతికేయొచ్చు.
ఎంతలో..
ఈ జీన్స్ నలుపు, నీలం రంగులో లభ్యమవుతుంది. ఈ ఎయిర్ బ్యాగు ఉన్న జీన్స్ బరువు సుమారు 80 పౌండ్లు. అంటే 40 కిలోలన్నమాట. ఇంత బరువున్న ఈ జీన్స్ ధర కూడా కొంచెం కాస్ల్టీనే! దీని ధర 499 డాలర్లు. అంటే మన కరెన్సీలో 41,317 రూపాయాలన్నమాట. వచ్చే నెల నుంచి ఈ ఎయిర్ బ్యాగ్ జీన్స్ ను కంపెనీ విక్రయానికి అందుబాటులోకి తీసుకురానుంది.