రష్యా శుభవార్త.. కరోనా టీకాకు క్లినికల్ ట్రయల్స్ పూర్తి - MicTv.in - Telugu News
mictv telugu

రష్యా శుభవార్త.. కరోనా టీకాకు క్లినికల్ ట్రయల్స్ పూర్తి

July 12, 2020

Russia

రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ కోరలు విరగ్గొట్టే మందు కోసం ప్రపంచం మొత్తం ఆశగా ఎదురుచూస్తోంది. ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది అంటూ ఆర్నెల్ల కాలం వెళ్లదీశాం. ఈ క్రమంలో ఎందరో అమాయకులు కరోనా మహమ్మారికి ప్రాణాలు అర్పించారు. పరిశోధకులు త్వరగా కరోనాకు విరుగుడుగా ఔషధాన్ని తీసుకురావాలని అందరూ ఆకాశానికి అర్రులు జాచి కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచానికి రష్యా ఒక శుభవార్త చెప్పింది. సెచెనోవ్‌ మెడికల్‌ యూనివర్శిటీలో కరోనా వ్యాక్సిన్‌కు విజయవంతంగా ట్రయల్స్‌ పూర్తయ్యాయని ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ వాడిమ్‌ తారాసోవ్‌ వెల్లడించారు. ‘రష్యాలోని గమాలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ టీకాను ఉత్పత్తి చేసింది. జూన్ 18న ట్రయల్స్ ప్రారంభించారు. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్ల బృందం బుధవారం డిశ్చార్జ్‌ కానుంది. ఇక రెండో బృందం జూలై 20న డిశ్చార్జ్‌ అవుతోంది’ అని ఆమె తెలిపారు.

తారాసోవ్‌ మరింత వివరణ ఇస్తూ.. ‘ఈ రెండు బృందాలకు కూడా సెచెనోవ్‌ యూనివర్శిటీ విజయవంతంగా పరీక్షలను పూర్తి చేసింది. కరోనా మహమ్మారి రెచ్చిపోతున్న సమయంలో సెచెనోవ్‌ విశ్వవిద్యాలయం ఒక విద్యా సంస్థగా మాత్రమే కాకుండా, ఔషధాల వంటి ముఖ్యమైన సంక్లిష్టమైన ఉత్పత్తుల తయారీలో ఓ భాగమైంది. శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనా కేంద్రంగా కూడా పనిచేసింది’ అని ఆమె అన్నారు. మరోవైపు సెచెనోవ్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ పారాసిటాలజీ, ట్రాపికల్, వెక్టర్-బోర్న్ డిసీజెస్ డైరెక్టర్ అలెగ్జాండర్ లుకాషెవ్ మాట్లాడుతూ.. ‘మేము ఈ టీకాతో పనిచేశాం. ట్రయల్స్‌లో ఈ దశ లక్ష్యం, మానవ ఆరోగ్యానికి వ్యాక్సిన్ భద్రతను పరీక్షించడం వంటి రెండు చర్యలు విజయవంతంగా పూర్తయ్యాయి’ అని తెలిపారు.