ముస్లిం సోదరులు పవిత్ర స్థలంగా భావించే సౌదీ అరేబీయాలోని మక్కా మసీదుకు సందర్శకుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. దీంతో మక్కాను దర్శించేవారికి అనుగుణంగా కొన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్ణయించింది. సందర్శకులు ఎక్కువైన సమయంలో మక్కా మసీదులో వేడి వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా.. ప్రజల ఇబ్బందులను తీర్చాలని జనరల్ ప్రెసిడెన్సీ ఆఫ్ మసీద్ నిర్ణయించింది. ప్రభుత్వ సహకారంతో మక్కా మసీద్ గ్రౌండ్ లో చల్లటి వాతావరణం నెలకొల్పేలా ఏర్పాట్లు చేసింది. అతిపెద్ద కూలింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి దీని ద్వారా గ్రౌండ్‌లోకి చల్లటి గాలి వెళ్లేలా ప్లాన్ వేశారు. ఈ గాలి కూలింగ్ ఇవ్వడమే కాకుండా స్వచ్చమైన వాతావరణాన్ని కల్పిస్తుంది.
ప్రస్తుతం మసీదులోకి చల్లటి గాలి అందించేందుకు రెండు పెద్ద ప్లాంట్లను ఏర్పాటు చేశామని మసీదు వ్యవహారాల డైరెక్టర్ మోహ్సేన్ ఆల్ సలామీ మీడియాకు తెలిపారు. ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద కూలింగ్ ప్లాంట్ అని పేర్కొన్నారు. ఇవి ప్రతిరోజు 35,300 టన్నుల గాలిని ఉత్పత్తి చేయగా.. 24,500 టన్నులు ఉపయోగించబడుతుందన్నారు. 9 గంటల పాటు ఈ ప్లాంట్ ఏకధాటిగా పనిచేస్తుందని తెలిపారు. ఎలాంటి గాలినైనా ఈ ప్లాంట్ స్వీకరించి దానిని శుద్ధి చేసి గ్రౌండ్‌లోకి పంపిస్తుందన్నారు. కాలుష్య వాతావరణాన్ని శుద్ధి చేయడమే కాకుండా కూలింగ్ ఏయిర్ సరఫరా చేస్తుందన్నారు. అత్యాధునిక ఇంజనీర్ల సహాయంతో దీనిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ ఏయిర్ వల్ల సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ప్రస్తుతం సెంట్రల్ లో ఈ కూలింగ్ వ్యవస్థ పనిచేస్తోందని, కాలానుగుణంగా అవసరమైన చోట్ల దీన్ని విస్తరిస్తామన్నారు.