వామ్మో.. ప్రపంచంలో పేద్ద మరకతం.. - MicTv.in - Telugu News
mictv telugu

వామ్మో.. ప్రపంచంలో పేద్ద మరకతం..

November 7, 2022

పచ్చలు, కెంపుల హారాలంటే భారతీయ మగువలకు చాలా ఇష్టం. హారాలే కాదు, చెవిదుద్దులు, గాజులు, ఉంగరాలు మొదలైన వాటికి పచ్చలను(ఎమరాల్డ్) వాడతారు. కొన్ని పరిశోధనల్లో, వస్తువుల తయారీలోనూ వీటిని వాడుతుంటారు. ఆకుపచ్చరంగులో మెరుపులీనే పచ్చలతో కళాకృతులు కూడా తయారు చేస్తుంటారు. మేలిరకం మరకతం ఖరీదు బరువును బట్టి వేల నుంచి కోట్లలో ఉంటుంది. అలాంటి ఎమరాల్డ్ చరిత్రలో మరో రికార్డు నమోదైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ముడి మరకతం ఆఫ్రికా ఖండంలోని జాంబియా దేశంలో దొరికింది. కాగెం గనిలో మనస్‌ బెనర్జీ, రిచర్డ్‌ కెప్టా నేతృత్వంలోని బృందం చేపట్టిన తవ్వకాల్లో ఇది లభ్యమైంది.

దీని బరువు 7,525 క్యారట్లు. కేజీల్లో చెప్పాలంటే 1.505 కేజీలు. వందల కోట్ల ధర పలకొచ్చని భావిస్తున్నారు. దీని పైభాగం కొమ్ములా ఉండడంతో ‘చిపెంబెలె’ అని పేరు పెట్టారు. అక్కడి బెంబా ప్రజల భాషలో ఆ మాటకు ఖడ్గమృగం అని అర్థం. జాంబియాలో భారీ మరకతాలు ఇదివరకు కూడా దొరికాయి. కొన్ని తక్కువ నాణ్యతవైతే కొన్ని మంచుముక్కల్లా మెరిసేంత నాణ్యమైనవి.