మూతిగుడ్డ ధర 11 కోట్లు   - MicTv.in - Telugu News
mictv telugu

మూతిగుడ్డ ధర 11 కోట్లు  

November 18, 2020

nng

జట్టు ఉన్న అమ్మ ఏ కొప్పు అయినా పెడుతుంది. డబ్బులున్న అయ్య ఏ మాస్క్ అయినా పెడతాడు. ఇది కరోనా కలికాలం. మనిషిని చూసి మనిషి భయపడుతున్న విలయకాలం. కానీ దీన్ని కూడా కొందరు తమ దర్జాను ప్రదర్శించుకోడానకి అనుకూలంగా మలచుకుంటున్నారు. 

కరోనా వైరస్‌కు మందు లేకపోవడంతో మాస్కులు, శానిటైజర్లే ఆయుధాలుగా మారాయి. అందరూ ఒకే రకం మాస్కులు వాడితే తమ ప్రత్యేకత ఏముంటుందని కొందరు కళలు ప్రదర్శిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన శంకర్ కురాడే అనే కుర్రాడు ఇటీవల 3 లక్షల రూపాయలు ఖరీదు చేసే బంగారు మాస్క్ పెట్టుకుని కలకలం రేపాడు. తాడిని తన్నే వాడుంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు కదా. బోడి బంగారం మాస్క్‌లో గొప్ప ఏముందని కొందరు వ్యాపారులు ఏకంగా  వజ్రాల మాస్కులు మార్కెట్లోకి తీసుకొచ్చారు.   


అమెరికాలో ఉంటున్న ఓ చైనా వ్యాపారవేత్త తన ప్రపంచంలోనే అతి ఖరీదైన మాస్కును ధరించాలని భావించాడు. అందుకోసం ఇజ్రాయెల్‌లోని జెరూసలేంలో ఉన్న ఓ ఆభరణాల సంస్థలో ఆర్డర్ చేశాడు. ఎన్ 99 ఫిల్టర్లు, బంగారం, వజ్రాలు పొదిగిన మాస్క్ ను తయారు చేయాలని కోరారు. దీని ఖరీదు సుమారు రూ. 11.2 కోట్లని జ్యూవెలరీ సంస్థ తెలిపింది. ఈ మాస్క్‌ను 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో తయారు చేస్తున్నామని, మాస్కు చుట్టూ 3,600 తెలుపు, నలుపు వజ్రాలతో అలంకరించనున్నామని జ్యులరీ సంస్థ వాళ్ళు వివరించారు.