world's one of highest rich women Mackenzie
mictv telugu

సగం మాత్రమే నాది అంటున్న అత్యంత సంపన్న మహిళ

November 10, 2022

సంపాదించడం వరకే నా బాధ్యత. కాన్ని దాచుకునే హక్కు నాకు లేదు అంటోంది ఆమె. అంత డబ్బును నేనొక్కదాన్నే వాడుకుంటే అది నా స్వార్ధమే అని కూడా చెబుతోంది. ఈరోజుల్లో కూడా ఇలా ఆలోచించేవారు ఉంటారా అని అనుకుంటున్నారా. మన డబ్బులున్నా పక్కవాడిని సొమ్మును ఎలా కొట్టేయాలా అన్నట్టు తయారయిన ఈ ప్రపంచంలో ఇంత మానవత్వంతో మాట్లాడుతున్నది ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా. అయితే ఇది చదివేయండి.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సంపన్న మహిళల్లో 30వ స్థానం ఆమెది. అమెరికాలో అత్యంత ధనికుల్లో మూడో స్థానం. కానీ మొత్తం దానం చేసేస్తోంది. తన ఆస్తిలో సగం దాన ధర్మాలకు కేటాయిస్తానని ప్రకటించి అన్నట్టుగానే ఇచ్చేసింది మెకంజీ స్కాట్‌.

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మెకంజీ, ప్రిన్స్‌టన్‌ యూనివర్శిటీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ చేశారు. ఓ ప్రైవేటు సంస్థలో జెఫ్‌ బెజోస్‌కు అసిస్టెంట్‌గా పని చేస్తూ ఆయనతో ప్రేమలో పడ్డారు. 1993లో వీళ్లు దంపతులయ్యారు. తర్వాత బెజోస్‌ స్థాపించిన అమెజాన్‌ సంస్థలో మెకంజీ కీలక బాధ్యతలను చేసారు. ఈ జంటకు ముగ్గురు మగపిల్లలు. చైనాకు చెందిన ఓ అమ్మాయినీ దత్తత తీసుకొన్నారు. 25 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఈ దంపతులు 2019లో విడిపోయారు. ఆ తర్వాత రెండేళ్లకు మెకంజీ ఓ హైస్కూల్‌ కెమిస్ట్రీ టీచర్‌ డేన్‌ జెవెట్‌ను వివాహమాడారు. అమెజాన్‌ సంస్థలో ప్రస్తుతం ఈమెకు 4 శాతం వాటా ఉంది. ఈవిడ ఆస్తులు సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల పైచిలుకే.

చిన్నప్పటి నుంచీ అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం మెకంజీకి ఇష్టం. ఆ అలవాటు ఆమెతోపాటే ఎదిగింది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు విరాళాలందిస్తూ వెన్ను దన్నుగా నిలుస్తున్నారీమె. మహిళలపై దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడటం కోసం ఓ స్వచ్ఛంద సంస్థనూ స్థాపించారు. 2020లో జాతి, లింగ సమానత్వం, ప్రజాస్వామ్యం, వాతావరణ మార్పులు, పేదలకు ఇళ్ళు లాంటి అంశాలపై కృషి చేస్తున్న వెయ్యికి పైగా స్వచ్ఛంద సంస్థలకు దాదాపు 96 వేల కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారీమె.

తన ఆస్తిలో సగం దానధర్మాలకు వినియోగిస్తానని ప్రకటించారు మెకంజీ. గతేడాది మరికొన్ని సంస్థలకు రూ.21,506 కోట్లు విరాళంగా అందించారు. తాజాగా ఓ ఆర్ఫనేజ్ కు 438 కోట్లు విలువ చేసే తన ఇళ్ళలను ఇచ్చేసి దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు.

కిందటేడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళగా ఫోర్బ్స్‌ జాబితాలో నిలిచిన మెకంజీ రచయిత్రి కూడా. తన తొలి నవలకు అమెరికన్‌ బుక్‌ అవార్డు అందుకున్నారు. తనకెంతో ఇచ్చిన సమాజానికి వేల కోట్ల రూపాయలు తిరిగిచ్చేస్తోన్న 52 ఏళ్ల మెకంజీ స్కాట్‌ మహిళాలోకానికి గర్వకారణం కదా.