పొట్టివాడని అందరూ ఎగతాలి చేసేవారు..తన ఆకారాన్ని చూసి నవ్వేవారు..వారి చూపులు, మాటలు, నవ్వులు మానసికంగా వేధించాయి. అయినా కుంగిపోలేదు. ఒకప్పుడు తనను చూసి నవ్విన ప్రతీ ఒక్కరికి సవాల్ విసిరాడు. తన సత్తే ఏంటో చూపించాడు. ఒకప్పుడు నవ్విన ఆ నోళ్లే ఇప్పుడు ఆ యువకుడిని చూసి శభాష్ అంటున్నాయి. ఆ కుర్రాడు ఎవరో కాదు మహారాష్ట్రకు చెందిన 3.4 అడుగుల ఎత్తు మాత్రమే ఉండే ప్రతీక్ విఠల్ మోహితే. ప్రపంచంలోనే అతి పొట్టి బాడీబిల్డర్‌గా గిన్నిక్ వరల్డ్ రికార్డుకు ఎక్కిన కండల వీరుడు ప్రతీక్ మరోసారి వార్తల్లో నిలిచాడు. 3.4 అడుగుల ఎత్తున్న ప్రతీక్ 4.2 అడుగుల ఎత్తున్న అమ్మాయిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. తన పెళ్లితో మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఈ బాడీబిల్డర్. ప్రస్తుతం ప్రతీక్ పెళ్లి వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పొట్టివాడు మహా గట్టివాడు అంటూ నెటిజన్లు ప్రతీక్‌ను పొగడ్తలతో ముంచేస్తున్నారు.
మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల ప్రతీక్, 22 ఏళ్ల జయను కుటుంబసభ్యుల సమక్షంలో సంప్రదాయాలను అనుసరించి పెళ్లి చేసుకున్నాడు. ప్రతీక్ జయను నాలుగేళ్ల క్రితమే కలిశాడు. అప్పుడే వారి మనసులు కలిశాయి. ఆ తరువాత ఇద్దరికీ వారి కుటుంబసభ్యలు నిశ్చితార్థం చేశారు. తాజాగా పెళ్లితో ఈ క్యూట్ కపుల్ ఒకటయ్యారు. ప్రతీక్ తన వివాహానికి సంబంధించిన పిక్స్‌ను తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేశాడు. దీంతో బాడీబిల్డర్ మరోసారి వార్తల్లో నిలిచాడు.
ప్రతీక్ విఠల్ మోహితే 2012లో బాడీబిల్డింగ్ ప్రారంభించాడు. అయితే మొదట్లో బాడీబిల్డింగ్‌పై అవగాహన లేని ప్రతీక్ చాలా కష్టపడ్డాడు. బరువుగా ఉండే బాడీబిల్డింగ్ పరికరాలను హాండిల్ చేయడం కాస్త కష్టతరమైంది. అయినా నిరుత్సాహ పడలేదు. పట్టుదలతో బాడీబిల్డర్‌గా మారాడు. ప్రతీక్ మొదటిసారి 2016లో పోటీలకు హాజరయ్యాడు. తరువాత తన మిత్రుడి ప్రోత్సాహంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ కోసం అప్లై చేశాడు. 2021లో ప్రపంచంలోనే అత్యంత పొట్టి బాడీబిల్డర్‌గా ఎంపికయ్యాడు. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్నాడు.