ఏపీలో దారుణ ఘటన..బాలిక గొంతు కోసిన ఉన్మాది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 14 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు నోట్లో, ముఖంపై యాసిడ్ పోసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై బాలిక గొంతు కోసి పరారయ్యాడు. బాలిక కేకలు విన్న చుట్టు పక్కలవారు రక్తపు మాడుగులో, ప్రాణాలతో కొట్టుమిడుతున్న బాలికను..నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాలిక నెల్లూరు నగరానికి సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కుటుంబ సభ్యులు సోమవారం సాయంత్రం పని మీద బయటకు వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉందని గుర్తించిన నాగరాజు అనే వ్యక్తి..ఇంట్లోకి ప్రవేశించి, ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దాంతో ఆందోళన చెందిన బాలిక..పక్కనే ఉన్న వాష్ రూంలోకి వెళ్లి, తలుపులు వేసుకునే ప్రయత్నం చేసింది. నిందితుడు నాగరాజు..తలుపులు బలంగా తోసుకుని లోనికి వెళ్లి, అక్కడ మరోమారు అత్యాచారానికి ప్రయత్నించాడు. దాంతో ఆ బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. భయంతో గట్టిగా కేకలు వేసింది.
దాంతో నిందితుడు..బాలిక నోట్లో, ముఖంపై యాసిడ్ పోశాడు. ఆ బాధ తట్టుకోలేక బాలిక మరింత గట్టిగా కేకలు వేసింది. చివరికి నిందితుడు కత్తి తీసి బాలిక గొంతు కోసి పరారయ్యాడు. చుట్టుపక్కల ఇళ్లవారు వచ్చి చూడగా బాలిక రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాధితురాలిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఆ కామాంధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.