Write it down..we will win: TRS minister
mictv telugu

రాసిపెట్టుకోండి..మేమే గెలుస్తాం: మంత్రి

August 14, 2022

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో జరగబోయే ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు? అనే విషయంపై పలు పార్టీల నేతలు రహస్యంగా సర్వేలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం మొదలుపెట్టారు. కానీ, ఇప్పటివరకూ ఆయా పార్టీల అభ్యర్థిగా ఎవరనీ ప్రకటించలేదు. ఈ క్రమంలో నల్గొండ జిల్లాలో నేడు పర్యటించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాసిపెట్టుకోండి మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని ఉద్ఘాటించారు.

”మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే. రాసిపెట్టుకోండి. మునుగోడులో బీజేపీకి దక్కేది మూడో స్థానం మాత్రమే. ఈడీ పేరు చెప్పి భయాందోళనలకు గురిచేయాలనుకుంటున్నారు. ఈడీ బోడీలకు భయపడే ప్రసక్తేలేదు. ఈడీని బీజేపీ తన జేబు సంస్థగా మార్చుకుంది. కేసీఆర్ ఎవరికీ లొంగే రకం కాదు. బీజేపీ దుర్మార్గాలను బయటపెట్టే సత్తా కేసీఆర్‌కు మాత్రమే ఉంది. ఈ పోరాటంలో వామపక్షాలు మాతో కలిసి వస్తాయని ఆశిస్తున్నాం” అని ఆయన అన్నారు.

మరోపక్క మునుగోడు గడ్డపై ఈసారి తమ పార్టీల జెండాలు రెపరెపలాడాలని బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ వంటి పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీల కీలక నేతలు, కార్యకర్తలు ఫలానా వ్యక్తి అయితే బాగుంటుందని ఆయా పార్టీల అధిష్టానాలకు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాఫిక్‌గా మారాయి.