ప్రాణం తీసిన సాహసం.. 62 అంతస్తుల భవనంపై నుంచి పడి.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రాణం తీసిన సాహసం.. 62 అంతస్తుల భవనంపై నుంచి పడి..

December 12, 2017

సాహసం అంటేనే ప్రాణాలతో చెలగాటం. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే జాగ్రత్తలు తీసుకుంటే సాహసం ఎలా అవుతుంది అని అంటుంటారు కొందరు. కానీ ప్రాణం సాహసం కంటే ముఖ్యం కదా. చైనాలో ఒక సాహసి 62 అంతస్తుల భవనం నుంచి పట్టుతప్పి కిందపడి చనిపోయాడు.
వూ వాంగ్‌నింగ్ ధీరుడు. ఎత్తయిన పెద్ద భ‌వ‌నాల నుంచి ఎలాంటి ఆధారాలూ లేకుండా వేలాడ్డం, ఫొటోలు తీయడం, సెల్ఫీలు తీసుకోవడం, డ్యాన్స్ చేయడం వంటివి చేస్తుండేవాడు. ఈ వీడియోలను యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ లైకులు, పైసలు సంపాదించేవాడు.

వూ ఇటీవల పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఓ రోమాంచిత సాహసం చేయాలని, తద్వారా వచ్చే డబ్బును పెళ్లికి ఖర్చుపెట్టాలనుకున్నాడు. హునాన్ రాష్ట్రంలోని ఓ 62 అంత‌స్తుల భ‌వ‌నంపై ఎక్స‌ర్‌సైజ్ స్టంట్ చేశాడు. చాలాసేపు ఆడుకున్నాడు.. వేలాడుతూ. అయితే కాసేపటి తర్వాత చేతులు అదుపు తప్పాయి.. మళ్లీ పైకెళ్లడానికి ఎంతో యత్నించాడు. అయినా ఫలితం లేకపోయింది. ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా లేకపోవడంతో ఎవరూ ఆ భవనంపైన లేరు. వాంగ్‌నింగ్.. అలా వేలాడుతూ పట్టుజారి కిందపడ్డాడు. నేలపై పడిపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి.