యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధానాలయం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి బ్రహ్మోత్సవాలు. దీంతో మరింత ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. కొండకింద భక్తులకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక తోరణాలను ఏర్పాటు చేశారు. కొండపై మాడవీధులు, విష్ణు పుష్కరిణి, సప్తరాజ గోపురాలను అందంగా విద్యుల్ దీపాళతో అలంకరించారు. చాలా కాలం తర్వాత జరుగుతున్న బ్రహ్మోత్సవాలు కావడంతో యాదాద్రి దేదీప్యమానంగా తీర్చిదిద్దారు. తిరుకల్యాణ మండపాలను ప్రత్యేకంగా అలంకరించారు. 11 రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలను పాంచరాత్రాగమ రీతిలో నిర్వహించనున్నట్లు ఆలయ అదికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం నుంచి బ్రహ్మోత్సవ పర్వ ఆవిష్కారం అవుతుంది. విష్వక్సేన ఆరాధనతో ఆది పూజలు మొదలు కానున్నాయి. అగ్నిఆరాధన, జలపూజ, శుద్ధి, పుణ్యావచనం అనంతరం రాత్రి అంకురార్పణ, నిర్వహిస్తారని ఆలయఅధికారులు తెలిపారు.