యాదాద్రి అనాథ పిల్లలు ఇక నా పిల్లలే.. సోనూ సూద్ - MicTv.in - Telugu News
mictv telugu

యాదాద్రి అనాథ పిల్లలు ఇక నా పిల్లలే.. సోనూ సూద్

July 31, 2020

Yadadri orphans are now my children .. Sonu Sood.

వరుసగా ఆపన్నులను ఆదకుంటూ బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన విశాల హృదయాన్ని చాటుకుంటున్నారు. లాక్‌డౌన్ మొదలు ఆయన ఆపదలో ఉన్నవారి వైపు నిలబడ్డం చూసి యావత్ ప్రపంచం మహా మనిషి అంటున్నారు. మొన్నటికి మొన్న ఏపీలోని పేద రైతుకి ట్రాక్టర్ కొనిచ్చి తన ధాతృత్వాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన అనాథ పిల్లలకు అన్నీ తాను అంటున్నారు. తల్లిదండ్రులు లేని ఆ పిల్లలు ఇకపై తన పిల్లలే అని అంటున్నారు. యాదాద్రి భునవగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో సత్యనారాయణ, అనురాధకు ముగ్గురు సంతానం.

 

ఏడాది క్రితం సత్యనారాయణ అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటినుంచి పిల్లల భారం  తల్లి అనురాధ మీదే పడింది. నిత్యం కూలీపనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలను సాకుతోంది. దురదృష్టవశాత్తు వారం రోజుల క్రితం తల్లి అనురాధ అనారోగ్యంతో చనిపోయింది. దీంతో పెద్ద కుమారుడు మనోహర్ తన చెల్లి, తమ్ముడి ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. ఇంత చిన్న వయసులో ఆ చిన్నారులు ఒకరికొకరు అన్నట్టు దిక్కులేకుండా జీవిస్తున్నారు. వారి గురించి రాజేశం కరణం అనే వ్యక్తి ట్విటర్ ద్వారా సోనూసూద్ దృష్టికి తీసుకొచ్చాడు. దీనిపై సోనూసూద్‌ వెంటనే స్పందించారు. ఆ ముగ్గురు పిల్లలు అనాథలు కాదని, ఇకపై తాను వారికి అండగా ఉంటానని మాట ఇచ్చారు. ఆ ముగ్గురి పిల్లల బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో సోనూసూద్ గొప్ప మనసుకు నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. ‘నువ్వు సినిమాల్లో విలన్‌వి కాదయ్యా.. నిజ జీవితంలో గొప్ప హీరోవి.. హ్యాట్సాఫ్’ అంటూ నెటిజన్లు సోనూను ప్రశంసిస్తున్నారు.