Yadadri's income is once again at a record level.
mictv telugu

మరోసారి రికార్డు స్థాయిలో యాదాద్రి ఆదాయం..

November 21, 2022

 

కార్తీక మాసం చివరి వారం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. నిన్న ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. వివిధ సేవల ద్వారా రూ.1,16,13,977 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. గత ఆదివారం నాటి రికార్డును ఈరోజు ఆదాయం బ్రేక్ చేసింది. కార్తీక ఏకాదశి, పైగా సెలవురోజు కావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు.

Once again Record Income To Yadagirigutta Lakshmi Narasimha Swamy Temple

హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. శివాలయం, కార్తీక దీపారాధన, వ్రత మండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. కల్యాణ కట్ట, పార్కింగ్ ఏరియా, బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు రద్దీగా మారాయి. దీంతో స్వామివారి దర్శనానికి 4 గంటలు.. ప్రత్యేక దర్శనానికి రెండు గంటలకుపైగా సమయం పట్టింది. భక్తులు భౌతిక దూరాన్ని పాటిస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక దర్శనం అనంతరం సాయంత్రం భక్తులు ఒక్కసారిగా తిరుగుప్రయాణం కావడంతో జాతీయ రహదారి 163పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరంగల్-హైదరాబాద్ మార్గంలో అర కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.

మరోసారి రికార్డు స్థాయి ఆదాయం

ఆదివారం వివిధ కైంకర్యాల ద్వారా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి రూ.1,16,13,977ల ఆదాయం లభించిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ.3,24,650, ప్రసాద విక్రయం ద్వారా రూ.44,37,150, పాతగుట్ట రూ.3,78,670, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.9,75,000, ప్ర చారశాఖ రూ.2,87,500, వీఐపీ దర్శనం రూ.18,90,000, సువర్ణ పుష్పార్చన రూ.2,52,348, కైంకర్యాలు రూ.16,100, సుప్రభాతం రూ.10,300, వ్రతాలు రూ.15,20,000, యాదరుషి నిలయం రూ.1,92,500, కళ్యాణ కట్ట రూ.1,78,000, శాశ్వత పూజలు రూ.37,500, వాహన పూజలు రూ.31,200, వేద ఆశీర్వచనం రూ.19,800, శివాలయం రూ.32,600, అన్నదానము రూ.55,659, బ్రేక్‌దర్శనం టికెట్ల విక్రయం ద్వారా రూ.9,75,000లు ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు.