అమెరికాలో యాదాద్రీశుడి కళ్యాణం.. ఇదే తొలిసారి - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో యాదాద్రీశుడి కళ్యాణం.. ఇదే తొలిసారి

May 28, 2022

అమెరికాలో తొలిసారి యాదాద్రీశుడి కళ్యాణం జరుగనుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు, మిగతా భక్తులు ప్రత్యక్షంగా స్వామివారి వైభోగాన్ని తిలకించనున్నారు. తెలంగాణ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ) ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఈ సంబరాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో టీటీఏ కాన్ఫరెన్స్‌ కమిటీ కన్వీనర్‌ గనగొని శ్రీనివాస్‌, అధ్యక్షుడు పటోళ్ల మోహన్‌ రెడ్డి ఈ కార్యక్రమాల విశేషాలను మీడియాకు వివరించారు. శుక్రవారం రాత్రి న్యూ జెర్సీ కన్వెన్షన్‌ సెంటర్లో బ్యాంకెట్‌ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు అవార్డులు అందజేస్తారు. అనంతరం సంగీత దర్శకుడు కోటి బృందం మ్యూజికల్‌ నైట్‌ నిర్వహిస్తారు. శనివారం ఉదయం తెలంగాణ వైభవాన్ని సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా స్వాగత నృత్య గీతం ఉంటుంది. దీనిని జొన్నవిత్తుల, వడ్డేపల్లి కృష్ణ రచించగా వందేమాతరం శ్రీనివాస్‌ ఆలపించారు. న్యూజెర్సీ గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ, స్థానిక సెనేటర్‌, మేయర్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం సాయంత్రం ప్రముఖ గాయని సునీత బృందం నిర్వహించే సంగీత విభావరి, రసమయి బాలకిషన్‌ బృందం ప్రదర్శన ఉంటాయి. సినీనటులు నిఖిల్‌, రీతూ వర్మ, అంజలి తదితర ప్రముఖులతో పాటు జబర్దస్త్‌ టీమ్ కామెడీ స్కిట్‌లు ఉంటాయి. ఇక ఆదివారం ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కల్యాణంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అదే రోజు రాత్రి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజికల్ నైట్ ఉంటుంది. ఈ కార్యక్రమాలకు యాంకర్స్ గా సుమ కనకాల, రవి వ్యవహరిస్తారు. టీటీఏ స్టార్‌ సింగర్‌ను ఉత్సవాల సందర్భంగా ప్రకటిస్తారు.