Home > ప్రత్యేక కథనాలు > మహాదివ్య పుణ్యక్షేత్రం… తెలంగాణ తిరుపతి

మహాదివ్య పుణ్యక్షేత్రం… తెలంగాణ తిరుపతి

చుట్టూ కొండలు…రమణీయమైన ప్రకృతి. కొండపై అడుగుపెట్టగానే పరిమళించే ఆధ్మాత్మిక శోభ.అదే దివ్యమైన పంచనారసింహ క్షేత్రం… యాదగిరి గుట్ట .ఈ ఆలయం స్వయంభు క్షేత్రంగా విలసిల్లుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఈ నారసింహ క్షేత్రం.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 60 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ నరసింహస్వామి వందరూపాలతో నిత్యపూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి పొందారు.ఎంతో మహిమాన్వితమైన యాదగిరి గుట్ట తెలంగాణ తిరుపతిగా మహాదివ్య పుణ్యక్షేత్రంగా వెలుగులీనుతోంది.

తెలంగాణ తిరుపతిగా ప్రాశస్త్యం పొందిన ఈ క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది.శాంత-రుష్యశృంగ మహర్షిల కుమారుడైన యాద మహర్షికి చిన్ననాటి నుంచి ఉగ్రరూపుడైన నరసింహస్వామి ఎలా ఉంటాడో చూడాలనే కోరిక ఉండేదట! ఆ స్వామి సాక్షాత్కారం పొందేందుకు దట్టమైన అడవుల్లో తిరుగుతూ కొండజాతి వారికి చిక్కాడు. వాళ్లు యాదుడిని క్షుద్రదేవతకు బలివ్వబోయారు. అప్పుడు రామబంటుగా హనుమంతుడు ప్రత్యక్షమై యాదర్షిని రక్షించి,కీకారణ్యంలో సింహాకార గుట్టలున్నాయనీ అక్కడికెళ్లి సాధన చేస్తే స్వామి సాక్షాత్కరిస్తాడనీ సూచించాడు.

యాదర్షి దీర్ఘకాల తపస్సు ఫలించి… నృసింహ స్వామి ప్రత్యక్షమయ్యాడట. అయితే, ఆ ఉగ్ర నరసింహ రూపాన్ని దర్శించలేకపోయాడు యాదర్షి. అతడి కోరిక మేరకు స్వామి శాంత స్వరూపంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహుడిగా ప్రత్యక్షమయ్యాడు.ఆ తర్వాత యాదరుషి స్వామిని వేరు వేరు రూపాల్లో చూడాలనుందని వరం కోరుకున్నాడు. దాంతో జ్వాల, గండభేరుండ, యోగానంద, ఉగ్రసింహ, శ్రీలక్ష్మీనృసింహ స్వామిగా ప్రత్యక్షమయ్యాడు మహా విష్ణువు. అందుకే, ఈ ఆలయాన్ని పంచనారసింహ క్షేత్రంగా పిలుస్తారు.

యాదరుషి కోరిక ఫలితంగా వెలసింది కాబట్టి, యాదగిరిగుట్టగానూ ప్రసిద్ధమైంది. యాదర్షి కోరికమీదే ఆంజనేయస్వామి యాదగిరి గుట్టకు క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. ఓ రాక్షసుడు తపోముద్రలో ఉన్న యాద మహర్షిని మింగేయాలని ప్రయత్నించడంతో విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని పంపి ఆ దైత్యుడిని అంతమొందించాడట. ఇప్పటికీ గుట్ట చుట్టూ సుదర్శనం రక్షా కవచంలా నిలిచి ఉంటుందనేది ఓ నమ్మకం.

యాదాద్రిలో గుట్ట మీదే కాకుండా కింద కూడా మరో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది. నిజానికి స్వామివారు ముందు ఈ పాత ఆలయంలోనే వెలశాడనీ తరవాత కొత్త నరసింహ స్వామివారి ఆలయానికి గుర్రంమీద వెళ్లేవారనేది మరో కథనం. కింది ఆలయం నుంచి పై ఆలయం వరకూ మెట్లమీద ఇప్పటికీ కనిపించే గుర్రపు పాద ముద్రలు అవేనంటారు. ఇక, మహిమాన్వితమైన యాదాద్రిలో నిత్యం శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు జరగడం వల్ల ఈ క్షేత్రం మరో అన్నవరంగా విలసిల్లుతోంది.

బ్రహ్మాండోత్సవం…

యాదాద్రి ఆలయంలో ఏటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవ సంప్రదాయాన్ని సాక్షాత్తూ బ్రహ్మదేవుడే స్వహస్తాలతో ప్రారంభించాడని చెబుతారు. అందుకే, వీటికి బ్రహ్మోత్సవాలనే పేరొచ్చింది. ఉత్సవాలు జరిగిన పదకొండు రోజులూ యాదగిరి ముక్కోటి దేవతల విడిదిల్లుగా మారుతుంది. ఆ సందర్భంగా సకల దేవతల్నీ శాస్త్రోక్తంగా ఆహ్వానించి, వేదోక్తంగా పూజలు నిర్వహించడం సంప్రదాయం. దానివల్ల క్షేత్ర మహత్యం రెట్టింపు అవుతుందట. యాదగిరిగుట్టలోని విష్ణు పుష్కరిణి సాక్షాత్తూ బ్రహ్మ కడిగిన పాదాల నుంచే ఉద్భవించిందంటారు. అనారోగ్యం, ఇతర గ్రహ సమస్యలున్నవారు ఈ పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తే బాధల నుంచి విముక్తులవుతారనేది భక్తుల నమ్మకం. గుట్టమీది ఆలయానికి మెట్ల మార్గంలో వెళ్లేటపుడు దార్లో శివాలయం కనిపిస్తుంది. ఇక్కడి శివుడు నరసింహస్వామి కన్నా ముందే స్వయంభూగా వెలిశాడట. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారికి కీళ్ల నొప్పులు తగ్గుతాయనేది మరో విశ్వాసం.

తెలంగాణ తిరుపతిగా…

ఎంతో మహిమాన్వితమైన యాదగిరి గుట్టను తెలంగాణ తిరుపతిగా మహాదివ్య పుణ్యక్షేత్రంగా తెలంగాణ ప్రభుత్వం తీర్చి దిద్దుతోంది . రెండువేల ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవనాలూ పార్కులూ కాటేజీలూ కల్యాణమండపాలనూ నిర్మించబోతోంది. సుమారు రూ.రెండు వేల కోట్లతో నిర్మించే ఈ మొత్తం క్షేత్రానికి ‘యాదాద్రి’ అనే నామకరణం చేశారు. ప్రస్తుతం అర ఎకరంలో ఉన్న ప్రధాన ఆలయం స్థానంలో 2.33 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి అద్భుతమైన డిజైన్లతో ఆలయ విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

యాదాద్రి పుణ్యక్షేత్రంపై సర్కారు దృష్టిపెట్టిన తర్వాత భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.నిత్యం వందలాది మంది భక్తులు స్వామీవారిని దర్శించుకుంటున్నారు. వీకెండ్ లో వేలాదిమంది నరసింహుడి సేవలో తరిస్తున్నారు.

దర్శనవేళలు

* ఉదయం 4 గంటలకు ఆలయం తెరుస్తారు.

* ఉచిత దర్శనంతో పాటు రూ. 50, రూ. 100, రూ. 150 టికెట్లపై ప్రత్యేక దర్శన సదుపాయం ఉంది.

* ఒక ప్రత్యేక దర్శనం టికెట్‌పై ఒకరినే అనుమతిస్తారు. క్యూలైన్‌లోనే ఈ ప్రత్యేక టికెట్లను విక్రయిస్తారు.

* మధ్యాహ్నం 12 నుంచి 12.45 వరకు విరామం

* ప్రత్యేక పూజలకు సంబంధించి అభిషేకం టికెట్‌ రూ. 500, అర్చన రూ. 216, సువర్ణ పుష్పార్చన రూ. 516

* త్వరలో ఆన్‌లైన్‌లో పూజ టికెట్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు.

పరిసరాలు.. ఉపాలయాల విశేషాలు: యాదగిరిగుట్ట ప్రధానాలయంతో పాటు ఆంజనేయస్వామి ఆలయంతో పాటు పుష్కరిణి చెంత మరో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. కొండపైనే శివాలయంలో శ్రీ పర్వతవర్ధిని మాత సమేత రామలింగేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఇలా ఈ క్షేత్రంలో శివకేశవులు కొలువై ఉండటం.. ఈ రెండు ఆలయాల్లోనూ నిత్యపూజలు కొనసాగుతుండటం విశేషం!

ప్రధాన పూజల వివరాలివి.. ఆలయంలో నిత్యం అభిషేకం, అర్చన, కల్యాణోత్సవం, అలంకారోత్సవాలు నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్లకు అర్చనలు కొనసాగుతాయి.

ఆర్జిత సేవల వివరాలు……..

* ఆలయంలో నిత్యం జరిగే శ్రీ లక్ష్మీ నరసింహుల నిత్య కల్యాణం టికెట్టు ధర రూ. 1,250

* శుక్రవారం అమ్మవారి ఉత్సవ సేవ టికెట్టు ధర రూ. 750

* ప్రతి మంగళవారం ఆంజనేయస్వామికి ఆకుపూజ, టికెట్‌ధర రూ. 216

* ప్రతి ఏకాదశి రోజున లక్ష తులసి పుష్పార్చన, టికెట్‌ ధర రూ.5,116

* స్వాతి నక్షత్రం రోజున శతఘటాభిషేకం, టికెట్‌ ధర రూ. 750

* కొండపైనే ఉన్న శివాలయంలో లక్షబిల్వార్చన టికెట్టు ధర. రూ. 250.

* శనివారం నవగ్రహ పూజలు, సోమవారం రుద్రాభిషేకం, కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. కల్యాణోత్సవానికి రూ. 250

*నవగ్రహ పూజకు రూ. 116, రుద్రాభిషేకం కోసం రూ. 116 టికెట్లను ఖరీదు చేయాలి.

వసతి సౌకర్యాలు

హైదరాబాద్‌ ప్రధాన బస్టాండ్ల నుంచి ప్రతి అరగంటకూ యాదాద్రికి వెళ్లే బస్సులున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కొండపై వసతిగదులు, కాటేజీలు ఉన్నాయి. రుసుము రూ. 200 నుంచి రూ. 2,500 వరకు ఉంటుంది.

Updated : 23 May 2018 2:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top