టూవీలర్ మార్కెట్లో యమహా కంపెనీ కొత్త తరహా స్కూటర్‌ని ఆవిష్కరించింది. ముందు రెండు టైర్లు, వెనుక ఒక టైరుతో వెరైటీగా ఉన్న ఈ స్కూటర్‌కి ట్రైసిటీగా నామకరణం చేసింది. జపాన్ మార్కెట్లో విడుదల చేసిన ఈ స్కూటర్ 125, 155 సీసీ విభాగాల్లో లభ్యమవుతుంది. కేవలం ముందు రెండు చక్రాలు ఉండడం తప్ప మిగతా స్కూటర్‌కి ఈ ట్రైసిటీకి వేరే ఏ తేడా లేదు. నిజానికి 2014లో యూరప్ మార్కెట్లో ఈ స్కూటర్‌ని ప్రవేశపెట్టింది యమహా. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు జపాన్‌లో విడుదల చేసింది. ఇండియాలో ఈ మోడల్ తెస్తారా? లేదా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ట్రైసిటీ ప్రత్యేకతలు చూస్తే.. డేటైమ్ ఎల్‌ఈడీ రన్నింగ్ లైట్స్, ఎల్‌సీడీ సెంటర్ కన్సోల్, సింగిల్ సీట్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కీలెస్ ఎంట్రీ, రెండు వైపులా డిస్క్ బ్రేకులు, ముందు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక డ్యుయెల్ షాక్ అబ్జార్బర్ కలిగి ఉంది. 125 సీసీ ధర జపాన్ కరెన్సీ యెన్‌లో 4 లక్షల 95 వేలు (రూ. 3.10 లక్షలు), 155 సీసీ ధర 5 లక్షల 56 వేల 500 యెన్లు (రూ. 3.54 లక్షలు)గా ఉంది. ఇప్పుడు బుక్ చేసుకుంటే ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో డెలివరీ అవుతాయని యమహా కంపెనీ వెల్లడించింది.