Yashoda movie Samantha latest Tollywood movie review
mictv telugu

యశోద మూవీ రివ్యూ… భారమంతా మోసిన సమంత

November 11, 2022

చాలా రోజుల తర్వాత తెలుగులో ఓ హీరోయిన్‌ ఓరియెంటెడ్ చిత్రం, టైటిల్‌ రోల్‌లో సమంత లాంటి స్టార్‌ హీరోయిన్‌. కానీ ఓ ప్రీరిలీజ్ ఈవెంట్, సినిమాకి సంబంధించిన ఒక్క ఫంక్షన్ కూడా చేయకపోయినా ‘యశోద’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇటీవల సమంత ఇచ్చిన ఇంటర్వ్యూ, తనకొచ్చిన వ్యాధి గురించి సోషల్ మీడియాలో వచ్చిన వార్తల వల్ల విడుదలకు ముందే ఈ చిత్రం వార్తల్లో నిలిచింది. మరి యశోదగా సమంత ప్రేక్షకుల్ని మెప్పించిందా? ఓవరాల్‌గా సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథేమిటంటే..

యశోద(సమంత) అద్దె గర్భం ద్వారా బిడ్డని కనివ్వడానికి ఒప్పుకుని ఓ సరోగసీ సెంటర్లోకి ప్రవేశించడంతో అసలు కథ ప్రారంభమవుతుంది. తనతో పాటుగా ఉన్న ఇంకొందరు గర్భిణులకు కూడా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా అన్ని రకాల సదుపాయాలందిస్తుంటారు ఆ సెంటర్ నిర్వాహకులు. కావల్సిన వసతులు కల్పిస్తూ బాగానే చూసుకుంటున్నా అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనల వల్ల యశోదకి అనుమానం కలుగుతుంది. అంతలా అక్కడ ఏం జరిగాయి? వాటి వెనకున్న రహస్యాలేంటి? వాటన్నిటినీ సమంత తెలుసుకుందా? ఆ సరోగసీ సెంటర్‌ ట్రాప్‌లోంచి బయటపడిందా? అనేదే సినిమా కథ.
కథనం, ట్విస్టుల విషయానికొస్తే..

ట్రైలర్లోనే కథ ఇదీ అని దాదాపు చెప్పేయడంతో ఇక థియేటరుకొచ్చి చూశాక ప్రేక్షకులు థ్రిల్లయ్యేలా ట్విస్టులు, కట్టిపడేసే కథనం ఉండేలా సినిమాను బాగా రాసి, తీశారు దర్శక ద్వయం హరీ, హరీష్‌. తొలి అర్ధభాగంల మెల్లిగా కథలోకి తీసుకెళ్లి, క్రమంగా యాక్షన్ డోస్ పెంచుకుంటూ, సస్పెన్స్‌ని క్రియేట్‌ చేస్తూ ప్రేక్షకులను ‘ఫ్రీజ్‌’ చేసే సీన్‌తో ఇంటర్వెల్‌ బాగా ప్లాన్‌ చేశారు. ఇక సెకండాఫ్‌లో కంప్లీట్ యాక్షన్ సన్నివేశాలతో, అసలు ట్విస్టుల్ని బహిర్గతం చేస్తూ ఆడియెన్స్‌ దృష్టి మరల్చకుండా బాగా తీశారు. ఇక మెయిన్‌ ట్విస్ట్‌ తెలిశాక సెకండాఫ్‌లో త్వరత్వరగా సినిమాని పూర్తిచేసి, విలన్లని పట్టించి, తొందరగా ఫినిష్ చేయాలన్నట్టుగా ఫక్తు తెలుగు సినిమా ఫార్మాట్‌లా అనిపించకపోదు.
ఎవరెలా చేశారంటే..

సినిమా మొత్తాన్ని యశోదగా తన భుజాల మీద మోసింది సమంత. ఫస్టాఫ్‌లో అక్కడక్కడా సమంత మార్క్‌ ఇన్నోసెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూనే, మెల్లిగా యాక్షన్‌ సీన్స్‌తో అదరగొట్టేసింది. గతంలో ఫ్యామిలీ మ్యాన్‌ టూ సిరీసులోనూ ఫైట్స్‌తో ఆడియెన్స్‌ని మెస్మరైజ్‌ చేసినా, ఈ మూవీకొచ్చేసరికి కాస్త డ్రామా అండ్ ఎమోషన్‌ కూడా తోడుకావడంతో ఇంకాస్త ఇంటెన్సిటీ కనిపిస్తుంటుంది. సమంత తర్వాత వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ నటనకీ, తన పాత్రకీ మంచి మార్కులు పడ్డాయి. యాక్టింగుతో ఆమె క్యారెక్టర్‌కి తనదైన టచ్‌ ఇచ్చింది. ఇక కల్పిక, విద్య, రావురమేష్‌, ఉన్ని ముకుందన్ ఇలా అందరూ పాత్ర పరిధిలో బాగానే చేశారు. టెక్నికల్‌ విషయాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే.. మణిశర్మ నేపథ్య సంగీతం చాలా సన్నివేశాలకు బలాన్ని అందించింది. ఎడిటింగులో ఇంకాస్త కత్తెర పదును పెంచినా బాగుండేది. మరీ ముఖ్యంగా సెకండాఫులో. ప్రత్యేకంగా వేసిన సెట్లలోనూ, యాక్షన్‌ సీన్స్‌లోనూ సుకుమార్ కెమెరా పనితనం బాగుంది. హరి, హరీష్‌ దర్శకత్వంతో పాటు కథ మీద చేసిన రీసెర్చ్‌ కూడా మెచ్చుకోదగ్గదే. వైద్యశాస్త్రంలోని అంశాలతో పాటు ఓ థ్రిల్లర్‌ మూవీని గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ ప్లేతో తీసి మెప్పించడంలో చాలావరకు సక్సెసయ్యారు.


ఒక్కముక్కలో ఓవరాల్‌గా..

పేరుకు హీరోయిన్‌ ఓరియెంటెడ్ బ్యాక్ డ్రాపే అయినా, సస్పెన్స్‌, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో పాటు కథనంలో ట్విస్టుల్ని ఇష్టపడే ఆడియెన్స్‌ ఈజీగా చూసేయొచ్చు. కానీ సినిమాకెళ్లేముందు మాత్రం చూసినవాళ్లతో చర్చిస్తే చిన్న చిన్న ట్విస్టులు తెలిసిపోయినా థియేటర్లో ఆ ఫీల్‌ మిస్సయే ప్రమాదం ఎక్కువే. సో.. ఏమీ డిస్కస్ చేయకుండా ఓసారి అలా వెళ్లి ఎక్స్‌పీరియన్స్‌ చేయొచ్చు.