ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా!..నేడే ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా!..నేడే ప్రకటన

June 21, 2022

భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. జులై 2న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదిగా, ఎన్నిక జులై 18న, ఫలితాలు 21న విడుదల చేయనున్నారు. అయితే, నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకూ అధికార పార్టీ గాని, ప్రతిపక్షాలు గాని రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించలేదు.

తాజాగా ప్రతిపక్షాల తరుపున రాష్ట్రపతి ఎన్నికల బరిలో.. మొదటగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పేరు, మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీలను అనుకున్నప్పటికి వ్యక్తిగత కారణాల వల్ల రాష్ట్రపతి రేసు నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు యశ్వంత్ సిన్హా పేరు తెరపైకి వచ్చింది. శరద్ పవార్ నేతృత్వంలో నేడు ఢిల్లీలో విపక్షాలు భేటీ కానున్నాయి. ఈ సమావేశంలో యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించే అవకాశం ఉందని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు.

యశ్వంత్ సిన్హా..1984లో జనతాదళ్ పార్టీలో చేరారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఏడాదికే ఆ పార్టీకి రాజీనామా చేసి, టీఎంసీలో చేరారు. ప్రస్తుతం ఆయన టీఎంసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయికి అత్యంత సన్నిహితుడు. సిన్హాకు వివిధ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన అభ్యర్థిత్వానికి ఇప్పటికే కొన్ని పార్టీలు మద్దతు పలికాగా, మమతా బెనర్జీ కూడా అందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. బీజేపీని ఎదుర్కొనేందుకు సిన్హా పేరు దాదాపు ఖారారు అనే చర్చ జరుగుతుంది. మరి ఈసారైనా విపక్షాల తరుపున రాష్ట్రపతి బరిలో యశ్వంత్ సిన్హా పోటీ చేస్తారా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.