విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా - MicTv.in - Telugu News
mictv telugu

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా

June 21, 2022

రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ఖరారయ్యింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో విపక్షాలు ఆయన పేరు ఏకగ్రీవంగా ప్రతిపాదించాయి. యశ్వంత్ సిన్హాను ప్రతిపక్షాల అభ్యర్థిగా నిర్ణయించినట్టు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనకు ముందే యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఈనెల 27న ఉదయం 11.30గంటలకు రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ వెల్లడించారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌ నిర్వహించనుండగా.. 21న ఓట్ల లెక్కింపు జరగనుంది. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీకి సన్నిహితుడైన సిన్హాకు వివిధ పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని అన్ని పార్టీలకు యశ్వంత్‌ సిన్హా విజ్ఞప్తి చేశారు. ఆయన కుమారుడు జయంత్‌ సిన్హా ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.