స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి తెగబడ్డారు. కార్యాలయంలోని కారుకు నిప్పుపెట్టి సామాగ్రిని ధ్వంసం చేశారు. రెండ్రోజుల క్రితం వంశీ చంద్రబాబు, లోకేశ్‌లపై తీవ్ర విమర్శలు చేయగా, దానికి ప్రతిగా టీడీపీ నేతలు విమర్శలకు దిగారు. దీంతో ఆగ్రహం చెందిన వైసీపీ శ్రేణులు సోమవారం సాయంత్రం పార్టీ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో ఆఫీసులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
అటు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించలేదని టీడీపీ నేతలు ఆరోపించారు. దాడితో పాటు పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ కోల్‌కతా – చెన్నై జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాలను రప్పిస్తున్నారు. ఘటనపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ రాజకీయ భిక్ష పెట్టిన పార్టీపై వంశీ చేసిన దాడి సరికాదని, వైసీపీలో ఎందుకు చేరారో అందరికీ తెలుసన్నారు. దొంగదెబ్బ తీయడం కాదని, దమ్ముంటే విజయవాడ సెంటర్‌లో ఫేస్ టు ఫేస్ తేల్చుకుందామని సవాల్ చేశారు.