టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పట్టణంలోని టీడీపీ నాయకుడి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గంగమ్మ గుడికి సంబంధించిన బాండ్లు ఇవ్వాలంటూ రాళ్లు, మద్యం సీసాలతో సోమవారం అర్ధరాత్రి దాడి చేశారు. వివరాల్లోకెళితే.. కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవాలయానికి గతంలో ఆర్ ఆర్ రవి అనే టీడీపీ సీనియర్ నేత చైర్మన్‌గా వ్యవహరించారు. గుడికి సంబంధించి రూ. 96 లక్షలు వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఆ బాండ్లు ఇవ్వాల్సిందిగా వారం రోజుల నుంచి రవిని రెస్కో చైర్మెన్, వైసీపీ నేత సెంథిల్ అడుగుతున్నారు. అవి తన వద్ద లేవని రవి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మరోసారి సెంథిల్ రవికి ఫోన్ చేసి బాండ్ల విషయం అడుగగా, అవి అప్పుడే దేవాదాయ శాఖకు ఇచ్చేశానని రవి బదులిచ్చాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగగా, అదే రోజు అర్ధరాత్రి నేతాజీ రోడ్డులోని రవి ఇంటిపై రాళ్లు, మద్యం సీసాలతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనపై రవి పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం నియోజకవర్గ ఎమ్మెల్యే చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు.